ఆధార్‌తో ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో సమన్వయం

22 Jun, 2018 01:36 IST|Sakshi
సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు

తద్వారా నేరస్తుల గుర్తింపు సులభం: కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌

ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో జాతీయ స్థాయి సమావేశాలు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌ : ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోతో ఆధార్‌ వ్యవస్థను సమన్వయం చేసేలా కసరత్తు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ వెల్లడించారు. తద్వారా నేరస్తుల గుర్తింపు సులభతరం అవుతుందని చెప్పారు. వేలిముద్రల సేకరణలో చట్టపర సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ప్రిజనర్స్‌ యాక్ట్‌ను సవరించేందుకు ఉన్నత స్థాయిలో చర్చిస్తామన్నారు. ఫింగర్‌ పింట్‌ బ్యూరో 19వ జాతీయ స్థాయి సమావేశాలు గురువారం హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి్ద సంస్థలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో తొలిరోజు కార్యక్రమానికి హాజరైన హన్స్‌రాజ్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ఒక్కరి వేలిముద్రలు డేటాబేస్‌లో ఉంటున్నాయని, కానీ మన దేశంలో నేరస్తులకు సంబంధించి 11.50 లక్షల మంది వేలిముద్రలే డేటాబేస్‌లో ఉన్నాయన్నారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో 80% కొత్త వ్యక్తులు చేస్తున్నవేనన్నారు. నేరాలు, శిక్ష శాతాల్లో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందన్న మంత్రి.. అన్ని రాష్ట్రాల డీజీపీలతో ఏటా ప్రధాని మోదీ సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. స్మార్ట్‌ పోలీసింగ్‌లో తెలంగాణ పోలీస్‌ శాఖ దూసుకెళ్తోందని హాన్స్‌రాజ్‌ ప్రశంసించారు. టెక్నాలజీ వినియోగంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ పోలీస్‌ శాఖ ‘ది బెస్ట్‌’గా ఉందని కొనియాడారు. ‘కంపెన్‌డియం ఆఫ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఎక్విప్‌మెంట్‌’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
 
అన్ని ఠాణాలకు డేటా: ఎన్‌సీఆర్‌బీ డీజీ 
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోలోని ఫింగర్‌ ప్రింట్‌ విభాగం వద్ద ఉన్న వేలిముద్రల డేటాను దేశంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు అనుసంధానం చేస్తామని ఎన్‌సీఆర్‌బీ డీజీ ఈష్‌కుమార్‌ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోని ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోల్లో తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని.. 250 పోస్టులకుగాను 50 మంది సిబ్బందే పనిచేస్తున్నారని చెప్పారు. ఏటా నమోదవుతున్న కేసుల్లో ఒక శాతం మాత్రమే ఫింగర్‌ ప్రింట్‌ సిబ్బంది, అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోను సర్కిల్, సబ్‌ డివిజన్‌ వారీగా నియమిస్తే కేసులు పరిష్కారంతోపాటు నియంత్రణ కూడా పెరుగుతుందని వివరించారు.   
అతి తక్కువ సమయంలో.. : డీజీపీ 
తెలంగాణలో ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోను పటిష్టం చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆటోమేషన్‌ ఆఫ్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ ఐడెంటిఫికేషన్‌ విధానం (ఏఎఫ్‌ఐఎస్‌) ఇటీవలే ప్రారంభించామని, అతి తక్కువ కాలంలో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. ఏఎఫ్‌ఐఎస్‌ విధానాన్ని అమలుపరచడంతో 868 పాత కేసులు పరిష్కరించామని, ఇందులో 480 కేసులు పాత ఫింగర్‌ ప్రింట్స్‌ విధానంలో పరిష్కారం కాలేదని వివరించారు. కొత్త విధానంతో నిందితుల నుంచి రూ.7.2 కోట్ల విలువైన సొత్తు కాపాడగలిగామని చెప్పారు. ఫింగర్‌ ప్రింట్‌ మొబైల్‌ డివైజ్‌ ద్వారా 1.22 లక్షల మంది వేలిముద్రలను సేకరించి డేటాబేస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందులో 7,273 మంది పాత నేరస్తులను గుర్తించినట్లు వెల్లడించారు. సదస్సులో ఎన్‌సీఆర్‌బీ జాయింట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ మాథుర్, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్, రాష్ట్ర ఐపీఎస్‌లు, సీఐడీ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు