అమెరికాను మించిపోతాం..!

20 Jan, 2019 04:51 IST|Sakshi

వచ్చే పదేళ్లలో ఆర్థిక వ్యవస్థలో భారత్‌ హవా..

స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకు నివేదికలో వెల్లడి

మన ఆర్థిక వ్యవస్థ 30 శాతం పెరుగుతుందని జోస్యం

2030 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్‌ అమెరికాను మించిపోగలదని బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్‌‡ చార్టర్డ్‌ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక అంచనా వేసింది. అమెరికాతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం 30 శాతం మేరకు పెరుగుతుందని జోస్యం చెప్పింది. చైనా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుని మొదటి స్థానంలో ఉంటుందని, అమెరికాకు రెండింతలు అవుతుందని వివరించింది. ఈ నివేదిక ప్రకారం.. అధిక జనాభా ఉన్న దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికాల్లోని దేశాలు రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమ ఆధిక్యత చాటుకోనున్నాయి. ఆర్థికంగా బలమైన జపాన్, జర్మనీలను ఈజిప్ట్, ఇండోనేసియా, రష్యాలు అధిగమించనున్నాయి. పట్టణీకరణ కారణంగా మధ్యతరగతి వర్గం భారీగా పెరుగుతుండటం వల్ల బ్రిక్స్‌ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) అంతకంతకూ బలం పుంజుకుంటున్నాయని పేర్కొంది.

10 కోట్ల కొత్త ఉద్యోగాలు..
వృద్ధి రేటును వృద్ధ జనాభా ప్రభావితం చేస్తుండటం, సీనియర్‌ సిటిజన్లు పెరిగిపోయిన జపాన్‌ వంటి దేశాల్లో శ్రామికుల కొరత ఏర్పడుతుండటం వంటి విషయాలు మనకు తెలిసినవే. భారత్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితి. యువ జనాభా ఎక్కువగా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమని ఈ నివేదిక పేర్కొంది. ప్రభుత్వం 2030 నాటికి తయారీ, సేవా రంగాల్లో 10 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించాలని, ఇందుకు నైపుణ్యపరంగా ఏర్పడిన లోటును పూడ్చేందుకు పూనుకోవాలని, మహిళలను పనుల్లో భాగస్వామ్యం చేయాలని, కార్మిక చట్టాలను సరళీకరించాలని సూచించింది.

కోటి మందికి శిక్షణ ఇవ్వాలి..
భారత్‌ ఏడాదికి ఒక కోటి మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా.. ప్రస్తుతం 45 లక్షల మందికి శిక్షణ ఇవ్వగల సామర్థ్యం మాత్రమే కలిగి ఉందని నివేదిక వివరించింది. మౌలిక సదుపాయాలపై వెచ్చించే మొత్తాలను పెంచేందుకు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు పాలకులు తగు చర్యలు చేపట్టాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీ పరంగా ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఇండియా, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, కెనడాలు మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు