పేదింటికి వెలుగు 

6 Mar, 2019 11:14 IST|Sakshi

రూ.125కే దీన్‌దయాల్‌ విద్యుత్‌ కనెక్షన్‌

లక్ష్యానికి మించి దరఖాస్తులు..

ఈ నెల 31తో  ముగియనున్న గడువు

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు

ఆదిలాబాద్‌టౌన్‌: కిరోసిన్‌ దీపాలు పెట్టుకొని కాలం గడిపే రోజులు పోనున్నాయి.. విద్యుత్‌ వైర్లకు కొండ్లు తగలించి కరెంట్‌ వాడుకోవడం వంటి బాధలు ఇక తప్పనున్నాయి. వీటన్నింటికీ చెక్‌ పెట్టి పేదింట్లో విద్యుత్‌ కాంతులు వెదజల్లే పథకం జిల్లాలో అమలవుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల్లో రూ.125కే విద్యుత్‌ వెలుగులు నింపేందుకు ప్రభుత్వం దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే జిల్లాకు ప్రభుత్వం 9వేల కనెక్షన్లు లక్ష్యం ఇవ్వగా, అంతకు మించి 11,114 దరఖాస్తులు వచ్చాయి.

ముఖ్యంగా విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం కావడంతో మరిన్ని దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్‌ సౌకర్యం లేని ఇల్లు ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాల్లో విద్యుత్‌ కనెక్షన్‌ లేకుండా ఇబ్బందులు పడుతున్న పేదల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపనుంది. అయితే ఈ పథకం చివరి గడువు ఈనెల 31తో ముగియనుంది. గతేడాది కాలంగా వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడంతోపాటు మీటర్లు బిగించి కరెంటు సరఫరా చేస్తున్నారు.

 రూ.125కే గృహ విద్యుత్‌

దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి పథకం ద్వారా రూ.125కే విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నారు. విద్యుత్‌ మీటర్‌తోపాటు ఒక ఎల్‌ఈడీ బల్బు, పది మీటర్ల సర్వీస్‌ వైర్, స్విచ్‌బోర్డు, అర్తింగ్, ఎంసీబీ బటన్‌ కూడా ఇస్తున్నారు. ఈ పథకానికి 2018 అక్టోబర్‌తో గడువు ముగిసినా పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు సంబంధిత విద్యుత్‌ శాఖ ఏఈ, లైన్‌మెన్‌లకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. లబ్ధిదారులు ఇంటి పన్ను రశీదు, ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబర్, రేషన్‌కార్డు జిరాక్స్‌లను దరఖాస్తుతోపాటు రూ.125 అందజేస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు.

లక్ష్యానికి మించి దరఖాస్తులు..

జిల్లాకు ఈ పథకం కింద 9వేల లక్ష్యం కేటాయించారు. కాగా ఇప్పటి వరకు 11,114 మంది లబ్ధిదారులు విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మార్చి 31 వరకు గడువు ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 80 శాతం వరకు కనెక్షన్లు కూడా అమర్చామని చెబుతున్నారు.

జిల్లాలో కనెక్షన్లు ఇలా..

మండలం  కనెక్షన్లు
ఆదిలాబాద్‌ ఉమ్మడి మండలం   649
బజార్‌హత్నూర్‌  955
బేల   832
బోథ్‌   1082
ఇచ్చోడ  546
జైనథ్‌  414
నేరడిగొండ     951
తలమడుగు  1055
 తాంసి   1309
గుడిహత్నూర్‌  155
ఇంద్రవెల్లి  849
నార్నూర్‌  228
ఉట్నూర్‌  904

మరిన్ని వార్తలు