5 నిమిషాల్లో కరోనా పరీక్ష

6 Apr, 2020 02:07 IST|Sakshi

‘హాట్‌స్పాట్‌’ ఏరియాల్లో ర్యాపిడ్‌ టెస్ట్‌లకు రంగం సిద్ధం

పరీక్షల తీరుతెన్నులపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు జారీ

అనుమానితుల రక్త నమూనాల సేకరణ.. అక్కడే పరీక్ష

పాజిటివ్‌ వస్తే కరోనా టెస్ట్‌.. నెగెటివ్‌ వస్తే హోం క్వారంటైన్‌

2.20 లక్షల మందికి సరిపడేలా కిట్లకు ఆర్డర్‌ ఇచ్చిన సర్కార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిర్ణయించింది. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటం, పెద్దఎత్తున పరీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2.20 లక్షల మందికి సరిపోయేలా కిట్ల కోసం ప్రభుత్వం ఆర్డర్లు పెట్టింది. వీటి ద్వారా రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి అక్కడికక్కడే ర్యాపిడ్‌ కరోనా టెస్ట్‌ చేస్తారు. ఐదు నిమిషాల్లో పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ అనేది తెలుస్తుంది. ఈ పరీక్షను రక్త నమూనాల    ఆధారంగా చేస్తారు. దీన్నే యాంటీబాడీ రక్త ఆధారిత పరీక్ష అని కూడా అంటారు. అంటే ఆ వ్యక్తి శరీరంలోకి వైరస్‌ ప్రవేశించిందా లేదా ప్రభావితమైందా అనేది ఈ ర్యాపిడ్‌ టెస్ట్‌ల ఉద్దేశం. ఈ పరీక్షలను కరోనా వైరస్‌ పాజిటివ్‌ అత్యధికంగా నమోదైన ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు. అందుకోసం అత్యధికంగా పాజిటివ్‌ నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గుర్తించే పనిలో ఇప్పటికే నిమగ్నమైంది.

పరీక్షల ప్రక్రియ ఇలా..
ఇప్పటికే హైదరాబాద్‌ సహా వరంగల్, నిజామాబాద్‌ జిల్లాల్లో హాట్‌స్పాట్లను గుర్తించారు. మిగిలిన జిల్లాల్లోనూ గుర్తిస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లోనే ర్యాపిడ్‌ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో ఒకవేళ పాజిటివ్‌ వస్తే తక్షణమే, హైదరాబాద్‌లోని నిర్ణీత ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ గొంతుల్లోంచి స్వాబ్‌ తీసి రియల్‌ టైం పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ–పీసీఆర్‌) పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాజిటివ్‌ వస్తే హైదరాబాద్‌లో చికిత్స చేస్తారు. ఇక ర్యాపిడ్‌ పరీక్షలో నెగటివ్‌ వచ్చినా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే వారిని హోం క్వారంటైన్‌లో 14 రోజులు ఉంచాలని ఐసీఎంఆర్‌ సూచించింది. వారికి లక్షణాలు అధికంగా ఉంటే హైదరాబాద్‌లో ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష నిర్వహిస్తారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో నెగటివ్‌ వచ్చిన వారు హోం క్వారంటైన్‌ పూర్తయ్యాక తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహించాకే బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. జాతీయస్థాయిలో ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ఈ పరీక్ష ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

హైదరాబాద్‌లో హాట్‌స్పాట్‌లివే..
రెండ్రోజుల క్రితం వరకు 25 హాట్‌స్పాట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు గుర్తించాయి. ఇంకా అనేక జిల్లాల్లో వీటిని గుర్తించే ప్రక్రియ మొదలైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన యూసఫ్‌గూడ, చంచల్‌గూడ, సికింద్రాబాద్, దారుషిఫా, మహేంద్రహిల్స్, సికింద్రాబాద్‌ ఎంజే రోడ్, నాంపల్లి, ఎమ్మెల్యే కాలనీ, న్యూమలక్‌పేట, నారాయణగూడ, ఖైరతాబాద్, మణికొండ, రాజేంద్రనగర్, షాద్‌నగర్, కుత్బుల్లాపూర్, టోలిచౌకి, చార్మినార్, ఫిలింనగర్‌ బస్తీ, బేగంపేట, నాచారం, కొత్తపేట, పీఅండ్‌టీ కాలనీ, అంబర్‌పేట ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేసుల సంఖ్య మరో నాలుగైదు రోజుల్లో పెరిగే పరిస్థితి ఉన్నందున మరికొన్ని ప్రాంతాలను గుర్తించే అవకాశముంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వేచేసి ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేసే విషయమై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదు. ఒకవిధంగా చెప్పాలంటే హైదరాబాద్‌ రెడ్‌జోన్‌లోనే ఉన్నట్టుగానే భావిస్తున్నారు. హాట్‌స్పాట్లకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లకు బాధ్యత అప్పగించామని అధికారులు చెబుతున్నారు.

వరంగల్‌ అర్బన్, నిజామాబాద్‌ జిల్లాల్లో..
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్‌పల్లి, మండిబజార్, పోచంమైదాన్, చార్‌బౌలి, కాశీబుగ్గ, గణేష్‌నగర్, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శాంబునిపేట, బాపూజీనగర్, చింతగట్టు క్యాంప్‌లను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. వీటినే నో మూమెంట్‌ జోన్లుగా అక్కడి అధికారులు పిలుస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కాలనీలను గుర్తించి ఎనెన్ని ఇళ్లలో సర్వే చేయాలో కూడా నిర్ణయించారు. ఆ తర్వాత అత్యధిక కేసులు నమోదైన నిజామాబాద్‌లో ఆర్యానగర్, మాలపల్లి, ఖిల్లారోడ్‌ను కూడా హాట్‌స్పాట్లుగా గుర్తించినట్లు తెలిసింది. కరీంగనగర్‌ జిల్లాలోనూ అధికంగా కేసులు నమోదయ్యాయి. అక్కడ కూడా అధికారులు హాట్‌స్పాట్లను గుర్తించినట్లు సమాచారం. తక్కువ కేసులున్న ప్రాంతాల్లో పాజిటివ్‌ వ్యక్తులున్న ఇళ్లకు మూడు కిలోమీటర్ల మేర హాట్‌స్పాట్‌గా ప్రకటించి కంటైన్మెంట్‌ ప్రణాళికను అమలుచేస్తారు. ఇంటింటికి వెళ్లి వైరస్‌ లక్షణాలున్న వారికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు