ఎయిర్‌పోర్ట్‌ లుక్కు.. నాంపల్లి తళుక్కు!

10 Dec, 2019 03:40 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ పాత నమూనా మార్చకుండానే కొత్త రూపు

అధునాతన సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం  

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి రైల్వేస్టేషన్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. రైళ్ల రాకపోకలకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణ, ప్రత్యేక వెయిటింగ్‌ హాళ్లు, ఫుడ్‌కోర్టులు, వినోద కార్యక్రమాలు, మల్టీలెవల్‌ కారు పార్కింగ్‌ వంటి సదుపాయాలతో విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుత స్టేషన్‌ నమూనాను మార్చకుండానే కొత్తరూపునిచ్చేందుకు ఇండియన్‌ రైల్వేస్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ) ప్రణాళికలను రూపొందించింది.

‘లష్కర్‌’ వెనక్కి.. ‘నాంపల్లి’ ముందుకు
రోజూ 1.8 లక్షల మందికిపైగా రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు దక్షిణ మధ్య రైల్వే గతంలో ప్రణాళికలు రూపొందించింది. కానీ నిర్మాణ సంస్థలు ముందుకు రాలేదు. దీంతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి, విస్తరణ, నిర్వహణ లక్ష్యంతో నోడల్‌ ఏజెన్సీగా ఏర్పాటైన ఐఆర్‌ఎస్‌డీసీ.. సికింద్రాబాద్‌ బదులు నాంపల్లి స్టేషన్‌కు ప్రాధాన్యతనిచ్చింది. డిజైన్‌ బిల్డ్‌ ఫైనాన్స్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో నాంపల్లి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

దేశవ్యాప్తంగా 5 స్టేషన్ల ఎంపిక
చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలున్న నగరాల్లో రైల్వేస్టేషన్లను పర్యాటక హంగులతో తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉం ది. ఈ క్రమంలో ఐఆర్‌ఎస్‌డీసీ దక్షిణమధ్య రైల్వే పరిధిలోని నాంపల్లితో పాటు, సికింద్రాబాద్, నాందేడ్, ఔరంగాబాద్, జాల్నా స్టేషన్లను అభివృద్ధికి ఎంపిక చేసింది. అజం తా, ఎల్లోరా గుహలు ఉన్న ఔరంగాబాద్‌ స్టేషన్‌ విస్తరణకు మొదట ప్రాధాన్యమిచ్చింది. 400 ఏళ్ల నాటి చారిత్రక హైదరాబాద్‌ను సందర్శించేందుకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకొనేలా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేశారు.

నాటి ప్రాభవానికి మళ్లీ వెలుగులు
నిజాం పాలకులు నాంపల్లిలో ‘హైదరాబాద్‌ దక్కన్‌ రైల్వేస్టేషన్‌’ను కట్టించారు. పబ్లిక్‌గార్డెన్స్‌ను ఇష్టపడే నిజాం నవాబు ఉస్మాన్‌ అలీఖాన్‌.. దానికి ఆనుకొని ఈ స్టేషన్‌ను నిర్మించారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలపడంలో ఇది కేంద్రబిందువు. అయితే దీని ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. నిత్యం ఇక్కడినుంచి 65 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. అయితే నాంపల్లి స్టేషన్‌ వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న 28 ఎకరాల స్థలంలో బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలను నిర్మించి భారీ షాపింగ్‌ మాల్స్, సూపర్‌బజార్‌లు, హోటళ్లు వంటి వాటి కోసం అద్దెకివ్వాలని భావిస్తున్నారు. 

ఇవీ కొత్త హంగులు
- ఇప్పుడున్న స్టేషన్‌కు రెండు వైపులా విస్తరణ.. వాక్‌వేల ఏర్పాటు
స్టేషన్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో రైళ్లు ఆగి, బయలుదేరుతాయి. మొదటి అంతస్తులో ప్రయాణికుల వెయిటింగ్‌ హాళ్లు..
- స్టేషన్‌ బయట మల్టీలెవల్‌ పార్కింగ్‌ సదుపాయం
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలంలో 4 అంతస్తుల భవన సముదాయాలను నిర్మించి అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు 

మరిన్ని వార్తలు