వివిధ దశల్లో 9 రైల్వే లైన్‌ ప్రాజెక్టులు

9 Aug, 2018 02:13 IST|Sakshi
కేంద్ర రైల్వే సహాయ మంత్రి రాజెన్‌ గొహెయిన్‌

ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు బదులిచ్చిన రైల్వే సహాయ మంత్రి

తెలంగాణలో రూ.14,665 కోట్లతో 1,093 కి.మీ. మేర పనులు..

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రూ.14,665 కోట్ల అంచనా వ్యయంతో 1,093 కి.మీ. మేర 9 కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో జరుగుతోం దని కేంద్ర రైల్వే సహాయ మంత్రి రాజెన్‌ గొహెయిన్‌ లోక్‌సభకు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మునీరాబాద్‌–మహబూబ్‌నగర్‌ లైన్‌ (246 కి.మీ.)లో 71 కి.మీ. పూర్తయిందని, జక్లేర్‌–కృష్ణా, చిక్కబెనకల్‌–యెరమరస్‌ మధ్య భూసేకరణ పూర్తయిందని పేర్కొన్నారు. మనోహరాబాద్‌–కొత్తపల్లి లైన్‌ (148.90 కి.మీ.)లో భూసేకరణ పూర్తయిందని వివరించారు. భద్రాచలం రోడ్డు–సత్తుపల్లి లైన్‌ (56.25 కి.మీ)లో భూసేకరణ పూర్తయిందని, వంతెనల పనులు, ఇతర పనుల కోసం టెండర్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు.

ఇక అక్కన్నపేట–మెదక్‌ లైన్‌ (17.2 కి.మీ )లో 338 ఎకరాలకు గాను 333 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మట్టి పను లు, వంతెనల పనులు ప్రారంభమయ్యాయని తెలి పారు. భద్రాచలం–కొవ్వూరు లైన్‌ తెలంగాణ విన్నపం మేరకు సత్తుపల్లి మీదుగా నిర్మించేందుకు కేంద్రం అంగీకరించిందని, తెలంగాణ గుండా 48.58 కి.మీ. మేర ఈ లైన్‌ వెళ్తోందని, అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇందుకు 50 శాతం వ్యయాన్ని భరించాల్సిందిగా కోరగా ఇంతవరకు సమాధానం రాలేదని వెల్లడించారు. ఇక మణుగూరు–రామగుండం లైన్‌ ప్రాజెక్టుకు కూడా తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా 50 శాతం వ్యయం, ఉచితంగా భూమి సమకూర్చాల్సి ఉందని, తెలంగాణ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. కొండపల్లి–కొత్తగూడెం రైల్వేలైన్‌ నిర్మాణం కోసం కూడా తెలంగాణ నుంచి వ్యయంలో వాటా కోరగా, ఇంకా స్పందించలేదని వివరించారు. 

మరిన్ని వార్తలు