ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వాయిదా

22 Dec, 2017 01:48 IST|Sakshi

ఓయూలో నెలకొన్న పరిస్థితుల వల్లే నిర్ణయం: వీసీ

ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 13,500 మంది ప్రతినిధులు

క్యాబ్‌లు, హోటళ్లు, విమాన టికెట్లు, సావనీర్‌ సహా సర్వం సిద్ధం

అడ్వాన్స్‌లు సైతం ఇచ్చాక వాయిదా వేయడంపై సర్వత్రా విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు జరగాల్సిన ప్రతిష్టాత్మక 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అనూహ్యం గా వాయిదా పడింది. శాంతిభద్రతలు, వర్సిటీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సదస్సును వాయిదా వేసినట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ సైతం తమ వెబ్‌సైట్‌లో సదస్సు వాయిదా పడినట్లు తెలిపింది.

సదస్సు ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. వందేళ్లకుపైగా చరిత్రగల సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులు వాయిదాపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన సదస్సును చివరి నిమిషంలో వాయిదా వేయడాన్ని విద్యార్థి, అధ్యాపక సంఘాలు తప్పుబట్టాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో వర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద విద్యార్థులు కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదస్సును ఓయూలోనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక...
ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌తోపాటు మహిళా సైన్స్‌ కాంగ్రెస్, చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్, సైన్స్‌ కమ్యూనికేటర్, సైన్స్‌ ఎగ్జిబిషన్‌ సహా 14 విభాగాల్లో సదస్సులను ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు 62 దేశాల నుంచి ఏడుగురు నోబెల్‌ అవార్డుగ్రహీతలు, 13,500 మందికిపైగా శాస్త్రవేత్తలు ఇప్పటికే తమ పేర్లను నమోదు కూడా చేసుకున్నారు. ఆరు వేల పరిశోధనా పత్రాలు, ఏడు వేల పోస్టర్లు వచ్చాయి.

శాస్త్రవేత్తల కోసం నిర్వాహకులు ఇప్పటికే నగరంలోని ప్రముఖ హోటళ్లలో ఐదొందలకుపైగా గదులను, సదస్సుకు తరలించేందుకు 500 క్యాబ్‌లను బుక్‌ చేశారు. విదేశాల నుంచి వచ్చే అతిథులకు విమాన టికెట్లు కూడా బుక్‌ చేశారు. సావనీర్, బ్రోచర్‌ సహా 15 వేల బ్యాగ్‌ల కొనుగోళ్లకు అడ్వాన్స్‌ కూడా చెల్లించారు. వేదిక, టెంట్లు, కుర్చీలు, లైటింగ్, వంట మనుషులను సిద్ధం చేశారు. ఇప్పటికే భారీగా ఖర్చు కూడా చేశారు. ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత సదస్సును వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే రూ. 1,000–2,000 చెల్లించి పేర్లను నమోదు చేసుకున్న ప్రతినిధులకు ఏం  చెప్పాలో తెలియని దుస్థితి నిర్వాహకులది.


ఇంటెలిజెన్స్‌ హెచ్చరికతోనే వాయిదా!
సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అర్ధంతరంగా వాయిదాపడటానికి శాంతిభద్రతల అంశమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఆశించిన రీతిలో లేవని, భద్రతా వ్యవహారాల రీత్యా సైన్స్‌ కాంగ్రెస్‌ను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర నిఘా వర్గాలు, పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.

ఒకవైపు ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదం తీవ్ర రూపు దాలుస్తుండటంతోపాటు తాజాగా మంద కృష్ణ మాదిగ అర్ధరాత్రి మెరుపు ర్యాలీ నిర్వహించడాన్ని ఇంటెలిజెన్స్‌ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, గతంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంలోనూ అనేక మంది విద్యార్థి నేతలను నిర్బంధించిన ఘటన నేపథ్యంలో సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు నిర్వహణకు ఆటంకం తలెత్తే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

సదస్సును ప్రధాని ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన్ను, సీఎం కేసీఆర్‌ను కొన్ని వర్గాల విద్యార్థులు అడ్డగించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఇటు ప్రభుత్వ వర్గాలకు, అటు ఉస్మానియా వర్సిటీ అధికార వర్గానికి చెప్పడంతోనే సదస్సు వాయిదా నిర్ణయం వెలువడినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  


సీఎం ఒత్తిడి మేరకే...  
సీఎం కేసీఆర్‌ ఒత్తిడి మేరకే వర్సిటీ వీసీ సదస్సును వాయిదా వేశారు. వందేళ్ల చరిత్ర గల ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ను హఠాత్తుగా వాయిదా వేయ డం వెనుక సీఎం హస్తం ఉంది. క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం ఉన్నప్ప టికీ శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నట్లు చిత్రీకరించి సదస్సును వాయిదా వేయడం దారుణం. సదస్సు ఓయూలోనే నిర్వహించాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం, వర్సిటీ పాలకవర్గం దాన్ని పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోంది.         – ప్రొ.భట్టు సత్యనారాయణ, ఔటా అధ్యక్షుడు

ఓయూకు బ్లాక్‌డే
ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వాయిదా ఓయూకు బ్లాక్‌డే. వాయిదా నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చారిత్రక నేపథ్యం ఉన్న వర్సిటీని దేశవ్యాప్తంగా అప్రతిష్టపాలు చేసేందుకే బలవంతంగా సదస్సును వాయిదా వేయించారు.     – ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్,ఎస్సీ ఎస్టీ టీచర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి

సమష్టి నిర్ణయం మేరకే వాయిదా
వర్సిటీలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా సదస్సును వాయిదా వేయాల్సి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్, ఉస్మానియా యూనివర్సిటీ సమష్టి నిర్ణయం మేరకే సదస్సు వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ఈ నెల 27న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. – ప్రొఫెసర్‌ రామచంద్రం, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ

మరిన్ని వార్తలు