'భారతీయులంతా భగవద్గీత చదవాలి'

18 Dec, 2014 01:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: భారతీయులమైన మనందరం భగవద్గీత చదవాలనీ, అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన ఈ ఉత్తమ గ్రంథం నుంచి రోజుకో పాఠం నేర్చుకోవచ్చని గవర్నర్ నరసింహన్ అన్నారు. ‘గీతా వారధి నిర్మాణం’ అనే 30 నిమిషాల లఘుచిత్రం డీవీడీని విడుదల చేస్తూ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక-సామాజిక సంస్థ ‘భగవద్గీత ఫౌండేషన్’ పక్షాన గాయకుడు, మాజీ జర్నలిస్టు ఎల్వీ గంగాధర శాస్త్రి సంగీతం సమకూర్చి, తెలుగులో తాత్పర్య సహితంగా పూర్తి భగవద్గీతను గానం చేశారు.

ఏడేళ్ల విశేష శ్రమ, కృషితో ఈప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా, ముందస్తుగా ఈ ‘మేకింగ్ ఆఫ్ భగవద్గీత’ లఘుచిత్రాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం సాయంత్రం గవర్నర్ విడుదల చేశారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆశీర్భాషణం చేస్తూ, భగవద్గీత కేవలం హిందూ మతగ్రంథం కాదన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎస్. వేణుగోపాలాచారి, రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్, ప్రముఖ సినీ దర్శకుడు కె. విశ్వనాథ్, నటుడు బ్రహ్మానందం, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, సీబీఐ మాజీ ఉన్నతాధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు