‘వందే భారత్‌’ బ్రేక్‌ డౌన్‌!

17 Feb, 2019 03:33 IST|Sakshi
శనివారం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మరమ్మతులు చేస్తున్న ఇంజనీర్లు

ప్రారంభించిన మరుసటి రోజే ఘటన 

పట్టాలు దాటుతున్న పశువులను ఢీకొట్టడంతో నిలిచిపోయిన రైలు

చివరి బోగీల్లో శబ్దం, దుర్వాసన రావడంతో అప్రమత్తమైన లోకో పైలట్లు 

మరమ్మతులు చేసి తిరిగి ఢిల్లీ పంపిన అధికారులు 

న్యూఢిల్లీ: ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌’కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. శుక్రవారం ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఈ రైలు తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్యతో తుండ్లా జంక్షన్‌ వద్ద నిలిచిపోయింది. పట్టాలను దాటుతున్న పశువులపై ఈ రైలు దూసుకెళ్లడంతో చక్రాలు పక్కకు జరిగాయని పశ్చిమ రైల్వే సీపీఆర్వో దీపక్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి 10.30 గంటలకు వారణాసి జంక్షన్‌ నుంచి బయలుదేరిన ఈ హైస్పీడ్‌ రైలు.. శనివారం ఉదయం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా జంక్షన్‌ వద్ద మొదటిసారి బ్రేక్‌ డౌన్‌ అయింది. దీంతో గంట సేపు అదే జంక్షన్‌లోనే రైలు నిలిచిపోయింది. ‘రైలు బ్రేక్‌ డౌన్‌ అయిన సమయంలో పలువురు జర్నలిస్టులు అందులో ప్రయాణిస్తున్నారు. రైలు తుండ్లా జంక్షన్‌కు వచ్చేటప్పుడు చివరి బోగీల్లో ఒకరకమైన శబ్దాలు వచ్చాయి.

చివరి నాలుగు బోగీల్లో కరెంటు లేకపోవడంతో ఒక రకమైన దుర్వాసన వచ్చింది. దీంతో లోకో పైలట్‌లు అప్రమత్తమై కొద్ది సేపు రైలు స్పీడ్‌ తగ్గించారు. ఆ తర్వాత బ్రేక్‌లలో సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులకు పైలట్‌లు చెబుతుండగా తాను విన్నాను’అని ఓ ప్రయాణికుడు చెప్పాడు. ఆ తర్వాత ఉదయం 8.15 గంటలకు ఇంజనీర్లు సమస్యను పరిష్కరించారు. 8.55 గంటలకు మళ్లీ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న విలేకరులు, బోర్డు అధికారులను వేరే రైలులో ఢిల్లీకి పంపించారు.

తర్వాత రైలుకు అవసరమైన మరమ్మతులు చేసి 100 కి.మీ.వేగంతో ఢిల్లీకి వచ్చిందని అధికారులు తెలిపారు. పశువులను ఢీకొట్టడం వల్లే రైలులో సాంకేతిక లోపం తలెత్తిందని రైల్వే ప్రతినిధి స్మితా శర్మ చెప్పారు. ఈ మేరకు సీపీఐ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో ఈ రైలు ఓ మంచి ఉదాహరణ అని అన్నారు. ఈ రైలు గురించి ఎంతగా ప్రచారం చేశారో అంతా విఫలం అయిందని ఎద్దేవా చేశారు.

>
మరిన్ని వార్తలు