విద్యుత్ పంపిణీలో అన్యాయం

28 May, 2014 01:10 IST|Sakshi

తెలంగాణకు రూ.1,060కోట్ల నష్టం: టీ-జాక్

 హైదరాబాద్: విద్యుత్ పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని టీ-విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (టీజాక్) మండిపడింది. కర్నూలు, అనంతపురం జిల్లాల సగటు విద్యుత్ వినియోగాన్ని లెక్కించడంలో జరిగిన తప్పుల వల్ల తెలంగాణకు ఏకంగా రూ.1;060 కోట్ల మేరకు నష్టం వాటిల్లనుందని టీజాక్ కో-ఆర్డినేటర్ కె. రఘు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. వాస్తవానికి 2005-06 నుంచి 2007-08 వరకు సగటున తీసుకుని కర్నూలు, అనంతపురం జిల్లాల సగటు విద్యుత్ వినియోగాన్ని మాత్రమే లెక్కించాలని కోరారు. ఈ మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగానే రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు విద్యుత్ కోటాను నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు.

అందువల్ల ఈ మూడు సంవత్సరాల సగటు వినియోగం ఆధారంగానే కర్నూలు, అనంతపురం జిల్లాల సగటు వినియోగాన్ని లెక్కించి.. ఈ మేరకు మాత్రమే సీపీడీసీఎల్ కోటా నుంచి ఎస్‌పీడీసీఎల్ కోటాకు మళ్లించాలని కోరారు. దీని ఆధారంగా లెక్కిస్తే రాష్ట్రం మొత్తం వినియోగంలో ఈ రెండు జిల్లాల సగటు విద్యుత్ వినియోగం కేవలం 5.9 శాతం మాత్రమేనన్నారు. అయితే, సగటున గత ఐదేళ్ల వినియోగాన్ని లెక్కించి 8.037 శాతంగా తేల్చడం సరికాదన్నారు. అదనంగా 2.14 శాతం కోటాను సీపీడీసీఎల్ నుంచి ఎస్‌పీడీసీఎల్‌కు మళ్లించారని తెలిపారు. తద్వారా తెలంగాణ ప్రాంతం ఏకంగా ఏడాదిలో 1902 మిలియన్ యూనిట్ల (ఎంయు) విద్యుత్‌ను నష్టపోతుందని.. దీనిని మార్కెట్ ధర (రూ.5.50)తో లెక్కిస్తే ఏకంగా రూ. 1060 కోట్లు అవుతుందన్నారు.

సమ్మెలు వద్దు: విద్యుత్ ఉద్యోగుల రెండు రోజుల సమ్మె వల్ల ఏమీ సాధించలేదని, పైగా రూ. 200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రఘు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సౌధలో ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో సమావేశమై సమ్మెపై చర్చించారు. విద్యుత్‌ను నిలుపు చేసి, ఇలాంటి సమ్మెకు దిగడం తెలంగాణ సంస్కృతి కాదని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా, సంస్థకు నష్టం వాటిల్లకుండా నిరసన కార్యక్రమాలు జరపాలన్నారు. మరో వారంలో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో సమ్మెలు సరికాదన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు