ఇందిరమ్మ ఇళ్లపై విజిలెన్స్‌ కన్ను!

11 May, 2018 03:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల కేసులో పునర్విచారణ కీలక మలుపు తిరిగింది. 2015లో సీఐడీ దాఖలు చేసిన ప్రాథమిక దర్యాప్తు ఫైలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (వీ అండ్‌ ఈ) కోర్టుకు చేరింది. తమ విచారణలోని అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దర్యాప్తు చేసి నివేదికివ్వాలని సీఐడీ ఉన్నతాధికారులు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు లేఖ రాశారు. ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తు 36 గ్రామాల్లోనే సాగింది.

ఇప్పుడు అన్ని గ్రామాల్లో విచారణ జరిపేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. 2009 తర్వాత ఎంతమంది బిల్లులు పొందారు.. ఏ మేరకు అక్రమాలు జరిగాయి? పాత్రధారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా అనే వివరాలనూ ఆరాతీయనుంది. కాగా, విజిలెన్స్‌ విచారణ అంశాలను బట్టి తాము చార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని, దర్యాప్తులో ఎదురయ్యే అంశాలను బట్టి ఆయా స్థానిక పోలీస్‌ స్టేషన్లలో కేసుల నమోదుకు విజిలెన్స్‌ సిఫారసు చేస్తుందని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు