ఇండోనేషియన్ల సహాయకులకు కరోనా నెగెటివ్‌

30 Mar, 2020 10:06 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియాకు చెందిన పది మంది మత ప్రచారకుల బృందానికి సాయం చేసిన ఇద్దరికి కరోనా నెగెటివ్‌ వచ్చిందని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఇండోనేషియా బృందంతో రామగుండం ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేయించిన వ్యక్తి, ఇండోనేషియా బృందంతో కలిసి ఎస్‌–9 బోగీలో ప్రయాణించి రామగుండంలో దిగిన మరో వ్యక్తిని తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు కూడా కరోనా లక్షణాలు లేవని వెల్లడించారు.

ఈ మేరకు వారిని ఇళ్లకు పంపించారు. ఈనెల 16న కరోనా లక్షణాలున్న ఇండోనేషియా బృందాన్ని కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించగా వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారితో ప్రయాణించి రామగుండంలో దిగిన వ్యక్తి ఆటోలో ఇంటికి వెళ్లాడు. దీంతో ఆటో డ్రైవర్‌తోపాటు, ప్రార్థనలు చేయించిన వ్యక్తిని అనుమానితులుగా ఈనెల 17 నుంచి సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. రెండు దఫాలుగా వారికి పరీక్షలు చేసి కరోనా సోకలేదని నిర్ధారించారు.  

మరిన్ని వార్తలు