విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి

2 Nov, 2019 03:42 IST|Sakshi

దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవుల రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమయ మహాసభకు ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ సమతుల్యత లోపించడం వల్ల చేతికివచ్చిన పంట ఇంటికి రావడం లేదన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అటవీ పరిసర ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణులు అటవీశాఖ అధికారులతో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఒక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ...విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.

శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ..ప్రొఫెసర్‌ జయశంకర్, శ్రీకాంతచారిలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై ప్రొఫెసర్‌ జయశంకర్, శ్రీకాంత చారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని, జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. విశ్వబ్రాహ్మణ మనుమయ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గణేషచారి మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని, ఉప్పల్‌లో కేటాయించిన స్థలంలో భవనాన్ని నిర్మించాలని, కర్రకోత మిషన్లకు లైసెన్స్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు ఆచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, సినీనటుడు నారాయణమూర్తి, మహాసభ సంఘ వ్యవస్థాపకులు గురుచరణంతో పాటు వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా