‘మిడిల్‌ కొలాబ్‌’ రాష్ట్రానికి గొడ్డలిపెట్టు

4 Jan, 2018 03:35 IST|Sakshi

ఇంద్రావతికి ఒడిశా అడ్డుకట్టతో రాష్ట్రానికి తగ్గనున్న నీటి ప్రవాహం

36 టీఎంసీలకు పైగా నీటిని వాడుకునేందుకు ఒడిశా ప్రణాళిక 

గోదావరి బోర్డుకు ఈ విషయాన్ని నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదికి ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతిని ఒడిసిపట్టేం దుకు ఒడిశా రాష్ట్రం మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టును చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిం ది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, నీటి వినియోగం మొదలు పెడితే ఇంద్రావతి దిగువ రాష్ట్రమైన తెలంగాణకు నీటి లభ్యత తగ్గిపోతుందని గుర్తించింది. ఇంద్రావతి నీటి లభ్యత తగ్గడం మొదలు పెడితే మన రాష్ట్రం లో చేపట్టే బోఢాఘాట్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టుకు నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం ఉంటుం దని అంచనాకు వచ్చింది. ఈ ప్రభావం దిగువన దేవాదుల ఎత్తిపోతలపైనా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

మంత్రి ఆదేశాలతో నివేదిక..
ఈ నేపథ్యంలో ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టాలపై లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో నీటిపారుదల అధికారులు ఓ నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఇంద్రావతి, కొలాబ్‌ నది కలిసేచోట మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టును 536.5 మీటర్ల నీటి మట్టంతో కొలాబ్‌ నదికి అడ్డంగా జోర్నాల వద్ద ఒడిశా చేపడుతోంది. కొలాబ్‌ దగ్గర వరద నీటిని తరలించేందుకు 35.50 కి.మీ. కాల్వ తవ్వనున్నారు.

ఈ నీటిని కొలాబ్‌కు ఉపనది అయిన కెరజోడిపైన 4.19 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న డ్యామ్‌ కు తరలించేలా ప్రతిపాదించారు. ఇక్కడ 75 శాతం నీటి లభ్యత లెక్కన 36.88 టీఎంసీల నీరు లభ్యతగా ఉంటోంది. అలాగే డ్యామ్‌ వద్ద పవర్‌హౌస్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ విద్యుదుత్పత్తికి వాడిన నీరు కొలాబ్‌ నదికి చేరేలా 264 మీటర్ల ఎత్తుతో మరో బ్యారేజీని నిర్మించనున్నారు. దీంతో 63,117 ఎకరాలకు ఈ బ్యారేజీ కింద సాగుకు నీరివ్వవచ్చు. ఈ ప్రాజెక్టుతో దిగువకు వచ్చే నీరు గోదావరిలోకి రాకుండా శబరిలోకి వెళ్లడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ అభ్యంతరం
దీనిపై ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలిపింది. నదీ పరీవాహకంలో పర్యావరణ, వాతావరణ సమతు ల్యత ఉండేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించగా, ఈ అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సీడబ్ల్యూసీ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే.. మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ బుధవారం ప్రభుత్వం గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఒడిశా ప్రాజెక్టుతో దిగువన తెలంగాణకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా, ప్రాజెక్టు ప్రతిపాదనలను మార్చాలని, డిజైన్‌లలో మార్పులు చేసి సవరించిన ప్రతిపాదనలు కోరాలని లేఖలో కోరింది. నీటి వినియోగం వివరాలు కూడా అందించేలా చూడాలని బోర్డుకు విన్నవించింది. ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరింది.   

మరిన్ని వార్తలు