వరంగల్-హైదరాబాద్ మధ్య పారిశ్రామిక కారిడార్

26 Nov, 2014 00:26 IST|Sakshi
వరంగల్-హైదరాబాద్ మధ్య పారిశ్రామిక కారిడార్

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చే యనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. రెండో దశలో హైదరాబాద్-మహబూబ్‌నగర్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ రూపొందిస్తామని వెల్లడించారు. వరంగల్, సిరిసిల్లలో టెక్స్‌టైల్ పార్కులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వినయ్ భాస్కర్, గువ్వల బాలరాజు (టీఆర్‌ఎస్), తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు (వైఎస్‌ఆర్‌సీపీ) అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలోనే అత్యుత్తమమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
 
 వచ్చే ఏడాది 2వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. 1800 మెగావాట్ల సౌర విద్యుత్తుకు బిడ్లు వచ్చాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామీకరణకు సంబంధించి  అవ గాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహకాలతో పాటు మార్జిన్ మనీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఈ వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. అలాగే అనుమతులకు సంబంధించి సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 15 నుంచి 30రోజుల్లో అన్ని అనుమతులు వచ్చేలా ఈ విధానం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలో స్థానికంగా లభించే వనరుల ఆధారంగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. 2005 నుంచి 2014 వరకు పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

మరిన్ని వార్తలు