టాపర్ల.. షికార్లు!

16 Nov, 2017 12:22 IST|Sakshi
గేట్‌ ఆఫ్‌ ఇండియా వద్ద పారిశ్రామికవేత్త లక్ష్మీకాంత్‌రెడ్డితో విద్యార్థులు

విమానంలో విహరించిన వచ్చిన పేద పిల్లలు  

అవి మరువలేని జ్ఞాపకాలు అంటున్న విద్యార్థులు

నర్వ, మరికల్‌: ‘మంచి మార్కులు తెచ్చుకుంటే ముంబాయికి విహారయాత్రకు తీసుకెళ్తానని.. విమానంలో చక్కర్లు కొట్టిస్తానని.. నగరంలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నింటిని చూయిస్తానని పారిశ్రామికవేత్త నర్వ లక్ష్మికాంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాటిచ్చారు. చెప్పినట్టుగానే ఉత్తమ గ్రేడులు సాధించిన వారికి విమానంలో తీసుకెళ్లి.. నగరంలో విహారం చేయించారు.  

విద్యార్థుల్లో నూతనోత్సాహం...
నర్వ, మరికల్‌ మండలాలకు చెందిన టెన్త్‌ టాపర్లతోపాటు ఈ ఏడాది పదవ తరగతి చదివే విద్యార్థులకు స్ఫూర్తి యాత్ర నూతనోత్సాహం కలిగించింది. రెండు రోజులు కొనసాగిన ఈ యాత్రలో లక్ష్మీకాంత్‌రెడ్డి స్వయంగా శంషాబాద్‌ నుంచి ముంబైకి తీసుకెళ్లారు. అక్కడి చారిత్రక, ప్రసిద్ధ స్థలాలను విద్యార్థులు వీక్షించారు. తాజ్‌హోటల్‌లో కాఫీలు, టిఫిన్‌లు.. జుహుబీచ్‌లో అరేబియా సముద్రపు అలల సోయగం.. గరంగరం మసాల దినుసుల ఆరగింపు.. ఆకాశాన్ని తాకే అంభానీ భవంతులు.. వింతలు.. విశేషాలు చూస్తూ విద్యార్థులు ఆనందంతో మునిగిపోయారు. అక్కడి జ్ఞాపకాలు వారి మాటల్లోనే విందాం..

మరిచిపోని అనుభూతి
టెన్త్‌ పరీక్షల్లో టాపర్‌గా వచ్చినందుకు విమానంలో వెళ్లడానికి అవకాశం కల్పించారు. ఇందుకు లక్ష్మీకాంత్‌రెడ్డికి కృతజ్ఙతలు. ఇంకా బాగా చదివితే ఇలాంటి అవకాశాలు మెండుగా ఉంటాయని అనిపిస్తోంది. –శ్రావణి ఇంటర్‌ మీడియట్‌ మరికల్‌ గ్రామం

విమాన ప్రయాణం బాగుంది  
టెన్త్‌లో మండల టాపర్‌గా వచ్చాను. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాను. సర్కారు బడుల్లో సత్తా చాటితే ఇలాంటి యాత్రలుంటాయని తెలిస్తే అందరు పోటీపడి చదువుతారు.       – నర్మద, మరికల్‌ గ్రామం  

ముంబైలో మస్తుగ తిరిగినం
ముంబై వీధుల్లో మస్తుగ తిరిగినం. అంబానీ భవంతి.. తాజ్‌హోటల్, ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద ఇళ్లు చూసినం. బీచ్‌లోని బాగా తిరిగినం. ఈ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా.  – నందిని, నర్వ గ్రామం

పిల్లలకు కొత్త ఉత్సాహం
సర్కారు బడుల్లో చదివే పిల్లలు కారు ప్రయాణానికి కూడా నోచుకోరు. అలాంటిది లక్ష్మీకాంత్‌రెడ్డి సహకారంతో పేద విద్యార్థులు విమానంలో తిరిగారు. అందరు కష్టపడి చదివితే భవిష్యత్‌లో ఇలాంటి రోజులు నిత్యం వస్తాయి.        – బాల్‌రాజు, ఎంఈఓ, నర్వ

మరిన్ని వార్తలు