ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లా : స్వాతిరెడ్డి

8 Mar, 2019 10:29 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో: కష్టాలు ఎదురైనా...కన్నీళ్లను దిగమింగుకొని...ఒకానొక దశలో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లి నేడు మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగారు ఎస్‌ఎస్‌ శ్రీఫుడ్స్‌ బిస్కెట్‌ కంపెనీ నిర్వాహకురాలు స్వాతిరెడ్డి.  చేతిలో చిల్లిగవ్వ లేకున్నా బ్యాంక్‌ రుణంతో ఏడాదికి కోటి రూపాయల వ్యాపారం చేసే స్థాయికి తీసుకువచ్చానని చెబుతున్నారు.  మాది కరీంనగర్‌.. నా 16వ ఏటానే రాజేశ్వర్‌రెడ్డితో వివాహమైంది. ఒక పాప, బాబు సంతానం. 2008లో హైదరాబాద్‌కు వచ్చాం. తొలినాళ్లలో చీరల వ్యాపారం మొదలెట్టా. 2013 నుంచి ఆన్‌లైన్‌లోనే చీరలు అమ్ముతూ ఇంటిఖర్చులు వెళ్లదీశా. బంధువులతో కలిసి 2016 జూన్‌లో బిస్కెట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టా.

అయి తే భేదాభిప్రాయాలు రావడంతో రూ.ఎనిమిది లక్షల నష్టం చేకూర్చారంటూ భాగస్వామ్యులు పక్కకు తప్పించారు.  2017 జూలైలో దాదాపు రెండు వారాల పాటు భర్త కరీంనగర్‌కు వెళుతున్నానని చెప్పి కనీసం సెల్‌ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడంతో ఏమీ చేయాలో తెలియలేదు. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి వెళుతుండటంతో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయికి వెళ్లా. మరో మూడేళ్లు చదివితే నేనే ఉద్యోగం చేస్తానంటూ పాప అన్న మాట కదిలించింది.  బంగారు ఆభరణాలను తనఖాపెట్టి ఫీజులు చెల్లించా.  ఓ స్వచ్ఛందసేవా సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఓ అబ్బాయి బిస్కెట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెడతానంటూ ముందుకురావడం ఆనందం కలిగించింది. అంతలోనే వెనక్కి వెళ్లడంతో  బ్యాంక్‌ నుంచి రూ.24 లక్షల రుణం తీసుకున్నా.  2018లో ఐడీపీఎల్‌లో ఎస్‌ఎస్‌ బిస్కెట్‌ కంపెనీ ప్రారంభించా.  ప్రస్తుతం 30 మంది సిబ్బందితో  ఎస్‌ఎస్‌ బిస్కెట్‌లను మార్కెట్‌లో అతితక్కువ కాలంలో అందరి నోళ్లలో నానేలా చేశాం. 12 మంది మహిళలకు ఉద్యోగాలిచ్చా. 

మరిన్ని వార్తలు