వేతనాల కోసం వెతుకులాట 

26 Mar, 2020 03:15 IST|Sakshi

లాక్‌డౌన్ నేపథ్యంలో ఉత్పత్తి నిలిపివేసిన పరిశ్రమలు 

డీలర్లు, మార్కెటింగ్‌ ఏజెన్సీల వద్దే పారిశ్రామిక ఉత్పత్తులు 

డబ్బులు చేతికి అందే పరిస్థితి లేక చిన్న పరిశ్రమల ఇక్కట్లు 

నెలాఖరున వేతనాలు చెల్లించేందుకు యాజమాన్యాల తంటాలు 

లాక్‌డౌన్ తో ఇళ్ల వద్దే కార్మికులు, అనిశ్చిత స్థితిపై ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్  ప్రకటించడంతో జన జీవితం పూర్తిగా స్తంభించింది. లాక్‌డౌన్‌లో భాగంగా పారిశ్రామిక ఉత్పత్తి కూడా నిలిచిపోవడంతో పారిశ్రామిక వాడలు బోసిపోతున్నాయి. ఆహార శుద్ధి, ఔషధ తయారీ రంగాలకు చెందిన 26 రకాల పరిశ్రమలకు మాత్రమే లాక్‌డౌన్  నుంచి మినహాయింపు లభించింది. పరిశ్రమల్లో ముడి సరుకులు, ఆర్డర్లు ఉన్నా ఉత్పత్తి చేసే అవకాశం లేకపోవడంతో కార్మికులు ఇళ్లకే పరిమితం అవు తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్‌లో కీలకపాత్ర పోషించే డీలర్లు, మార్కెటింగ్‌ ఏజెన్సీలు కూడా లావాదేవీలను నిలిపివేశారు. లాక్‌డౌన్ ప్రకటనకు ముందు డీలర్లు, ఏజెన్సీలకు సరఫరా చేసిన ఉత్పత్తులకు సంబంధించిన బిల్లులు యాజమాన్యాలకు తిరిగి రాలేదు. మరోవైపు తాజా ఉత్పత్తులు కూడా మార్కెట్‌కు చేరవేసే పరిస్థితి  లేదు. దీంతో తమ వద్ద ఉన్న వర్కింగ్‌ క్యాపిటల్‌ అటు మార్కెట్‌లోనో, ఇటు ముడి సరుకులు లేదా ఉత్పత్తి రూపం లోనో మిగిలిపోవడంతో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. 

వేతనాలు చెల్లించేందుకు తంటాలు 
కాస్టింగ్‌ పరిశ్రమల్లో పనిచేసే అసంఘటిత రంగ కార్మికుల వేతనాలను వారం లేదా పక్షం రోజులకోమారు యాజమాన్యాలు సంబంధిత లేబర్‌ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంటాయి. ఇతర కేటగిరీలకు చెందిన కార్మికులు, ఉద్యోగులకు మాత్రం ప్రతి నెలా మొదటి వారంలో వేతనాల చెల్లింపు జరుగుతుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వేతనాలు,  కరెంటు బిల్లుల చెల్లింపు వంటి వాటి కోసం డబ్బులు వెతుక్కునే పరిస్థితిలో ఉన్నామని చిన్న, మధ్య తరహా పరిశ్రమల యాజమాన్యాలు చెప్తున్నాయి. మార్చి నెలకు సంబంధించి కార్మికులు, ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. భారీ పరిశ్రమలకు మాత్రమే ఈ తరహా భారాన్ని మోసే శక్తి కొంత మేర ఉంటుందని, సూక్ష్మ, లఘు, చిన్న తరహా పరిశ్రమలకు వేతనాల చెల్లింపు భారంగా మారుతుందని పరిశ్రమల వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుత సమయంలో కార్మికులకు అండ గా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందనే విషయాన్ని కూడా యాజమాన్యాలు అంగీకరిస్తున్నాయి. 

వెసులుబాటు కోరుతున్న యాజమాన్యాలు 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం పారిశ్రామిక రంగం సమస్యలపైనా దృష్టి సారించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తూనే, పారిశ్రామిక రంగం మనుగడ కోసం కొన్ని వెసులుబాట్లు ప్రకటించాలని కోరుతున్నారు. విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, బ్యాంకు రుణాలపై వడ్డీ చెల్లింపు వాయిదా, ఓడీ రూపంలో నగదు తీసుకునే అంశాల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బోసిపోయిన పారిశ్రామిక వాడలు 
పారిశ్రామిక వాడలు లాక్‌డౌన్ కారణంగా బోసిపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు పరిశ్రమలకు అనుబంధంగా ఉండే షెడ్లలో తలదాచుకుంటున్నారు. కార్మికులు ఇళ్లకే పరిమితం అవుతుండగా, తాత్కాలిక ఉపశమనం కోసం కొన్ని యాజమాన్యాలు కొంత నగదు, నిత్యావసరాలు, కూరగాయలు వంటి వాటిని సమకూరుస్తున్నారు. ఆర్థిక స్తోమత, ఆర్థిక క్రమశిక్షణ లేని కొన్ని కంపెనీలు మాత్రం కార్మికులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. పరిశ్రమల్లో పారిశుధ్యం, పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఓవర్‌ హాలింగ్, మరమ్మతులు వంటి పనులపై కొన్ని యాజమాన్యాలు దృష్టి సారించాయి.  

మరిన్ని వార్తలు