ఓ ప్రజాస్వామ్యవాది అలుపెరుగని ప్రస్థానం 

29 Jul, 2019 02:22 IST|Sakshi

తనను తాను రాజకీయ మేరునగధీరుడిగా మలచుకున్న కృషీవలుడు జైపాల్‌రెడ్డి. దేశం గర్వించదగ్గ పార్లమెంటరీ నాయకుడిగా భారత రాజకీయాలపై ఆయనొక బలమైన ముద్ర. సమకాలీన రాజకీయాలు–మేధావిత్వాన్ని జతకలిపి ఆలోచించిన ప్రతి సందర్భంలోనూ ఆయన పేరు గుర్తుకు రావాల్సిందే! ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమా సిద్ధాంతాలు, విలువల్లో రాజీపడకుండా ఓ సంపూర్ణ, సంతృప్తికర జీవితం గడిపారాయన. జైపాల్‌రెడ్డి ఎదుగుదలకు ఉపకరించిన అంశాలెన్నో ఉన్నా.. ప్రాథమికంగా ఆయన బలమైన ‘ప్రజాస్వామికవాది’కావడమే ఎదుగుదలకు ప్రధాన కారణం. ఇది మామూలు సందర్భాల్లోకన్నా సంక్లిష్ట సమయాల్లోనే ఎక్కువగా వెల్లడైంది. కాంగ్రెస్‌లో ఎదుగుదల, ఎమర్జెన్సీని వ్యతిరేకించి కాంగ్రెస్‌ను వీడటం, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం, జనతాపార్టీలో చేరడం తిరిగి కాంగ్రెస్‌ గూటికి రావడం.. వరించి వచ్చిన పదవుల్నీ తృణప్రాయంగా నిరాకరించడం.. ఇలా ఏ పరిణామాన్ని తీసుకున్నా తన మౌలిక రాజకీయ సిద్ధాంత బలమే ఆయన్ని నడిపింది. అంతకుమించి ఆయన్ని నిరూపించింది. అందుకే, ఆయన్ని గమనిస్తున్న ఓ తరం రాజకీయ నేతలు, పరిశీలకులు ‘ఒక శకం ముగిసినట్టే’అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో వ్యక్తి అటువంటి రాజకీయ జీవితం గడపడం అసాధ్యమంటున్నారు.

ప్రజాస్వామ్యాన్ని బలంగా విశ్వసించడమే కాకుండా దాని చుట్టే తన రాజకీయ మనుగడని అల్లుకొని, విలువల్ని వీడకుండా, అవకాశాల్ని వినియోగించుకుంటూ పైకెదిగిన నేత జైపాల్‌రెడ్డి. శారీరక వైకల్యం శాశ్వతమని గ్రహించిన క్రమంలోనే ఇతరులకన్నా తనని కాస్త విభిన్నంగా ఉంచగలిగిందేమిటనేదే ఆయనలోని మొదటి సంఘర్షణ. తెలివి, విజ్ఞానం కొంతమేర తన అవకాశాల్ని మెరుగుపరుస్తుందని విద్యార్థి దశలోనే నిర్ణయించుకొని, అందుకోసం ప్రత్యేకంగా కృషిచేశానని ఆయనే చెప్పేవారు. రేయింబవళ్లు విస్తృతంగా చదివేవారు. ఇంగ్లీష్‌పై మక్కువతో ఎమ్మే ఇంగ్లీష్‌ చదివినా, రాజకీయాలపై ఆసక్తితో చరిత్ర–రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసినా.. ఆ క్రమంలో తనకు తత్వశాస్త్రంపై మోజు పెరిగిందనేవారు. ఇటీవల ఆయన వెలువరించిన ‘టెన్‌ ఐడియాలజీస్‌’ఒక గొప్ప తత్వశాస్త్ర గని. తనకున్న సహజనాయకత్వ లక్షణాలకు విద్యార్థి దశలోనే పదునుపెట్టి భవిష్యత్‌ రాజకీయ మనుగడకు బాటలు వేసుకున్నారు. పీయూసీ చదివే రోజుల్లో, నిజాం కాలేజీ విద్యార్థిగా తెలివితేటలు పెంచుకోవడం, వీటిని ప్రదర్శించడం మొదలైంది. ఇతర కాలేజీల నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు కేవలం ఆయన ప్రసంగాల్లోని భాషా పటిమ, బలమైన భావాలు, పదునైన వ్యక్తీకరణ కోసమే నిజాం కాలేజీకి వచ్చేవారు. వేదికల మీద, కింద కూడా వక్తగా ఆయనొక ప్రభావశాలి! ఆయన ఎప్పుడు రెడ్డి హాస్టల్‌ సందర్శించినా.. అదొక చర్చావేదికయ్యేది. 

రహస్యమెరిగిన నిపుణుడు 
పార్లమెంటరీ ప్రసంగ నైపుణ్యమెరిగిన వాడు కనుకే సభ లోపలా, బయటా అధికుల్ని ఆకట్టుకునేలా జైపాల్‌రెడ్డి మాట్లాడేవారు. వాజ్‌పేయి ప్రభుత్వం పార్లమెంటులో ఒక ఓటు తేడాతో కూలిపోవడానికి ముందు, విపక్షం తరపున ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రసారమాధ్యమాలు ఆకాశానికెత్తాయి. ‘రాజ్యాంగ నిర్మాణ సభ’లో జరిగిన విస్తృత చర్చల్ని క్షుణ్ణంగా చదివేవారు. అందుకే, ఏదైనా అంశం సభలో వివాదాస్పదమైనపుడు, సదరు అంశానికి మూలాలు రాజ్యాంగంలో ఎక్కడున్నాయి? ఎందుకు? ఎలా పొందుపరిచారు? అప్పుడు ఏమనుకున్నారు? ఉటంకిస్తూ.. అదెలా తప్పో, ఒప్పో చెప్పే వారు. ఆయన ప్రసంగాలు సూటిగా, అతి ప్రభావవంతంగా ఉంటా యే తప్ప సుదీర్ఘంగా ఉండవు. దక్షిణాది నుంచి తొలి ఉత్తమపార్లమెంటేరియన్‌గా అవార్డు దక్కినపుడు, ఇంగ్లీష్‌ దినపత్రిక దిహిందూ ‘దేశంలోనే అత్యుత్తమ రాజకీయ పదసముచ్ఛయ కర్త’అని రాయడం ఆయనకు నిజమైన ప్రశంస. పదాల ఉచ్ఛరణ (ఫొనెటిక్స్‌) పైనా తగు అధ్యయనంతో ఆయన వాడే కొన్ని ఆంగ్ల పదాలకు చట్టసభ లేఖకులు, నేతలు, చివరకు జర్నలిస్టులు డిక్షనరీలు వెతకాల్సి వచ్చేది. బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ దీన్ని సభలోనే అంగీకరించారు. జర్నలిస్టుల్లో అత్యధికులు ఆయనకు ఆత్మీయులు. ఢిల్లీలో ఏటా ఓరోజు జర్నలిస్టులకు విందు ఇచ్చేవారు. తరచూ నియోజకవర్గాలు మారుతారు అనే విమర్శను సున్నితంగా తిప్పికొడుతూ, ‘నిజానికి మీడి యా నా స్థిర నియోజకవర్గం’అని ఛలోక్తి విసిరేవారు. సిద్ధాంతాలు, పార్టీ విధానాలు, రాజకీయ విలువలు, వాస్తవిక పరిస్థితులపై ఆసక్తిగా చర్చించే వారు కలిస్తే, సుదీర్ఘంగా ముచ్చటించడానికి ఇష్టపడేవారు. ఆయనతో అప్పుడప్పుడు భేటీ అయ్యే అవకాశం లభించిన వారిలో నేనొకడ్ని! తను రచించిన ‘టెన్‌ ఐడియాలజీస్‌’తొలి పలుకుల్లో ఓ ప్రస్తావన చేస్తూ, ‘గరిష్ట సంక్షేమం, కనీస యుద్ధకాంక్షను సాధించడమే రాజకీయ సిద్ధాంతాల అసలు లక్ష్యం’అన్నారు. ప్రజాస్వామ్యవాదమే పరమావధిగా సిద్దాంతాలు, విలువలు, మేధస్సు నడిపిన నేత జైపాల్‌రెడ్డి. 

చెదరని మనోధైర్యం 
శారీరక వైకల్యం ఉన్నా ఇతరరేతర నైపుణ్యాల్ని వృద్ధి చేసుకొని శారీరక లోపాల్ని అధిగమించవచ్చని నిరూపించిన జైపాల్‌రెడ్డి ఒక స్ఫూర్తిదాత! శరీర భౌతిక ధర్మాన్నే కాక అంతర్గత రసాయన ధర్మాల పట్లా ఆయనది లోతైన అవగాహన. దశాబ్దాలుగా తనలో భాగమై ఉన్న మధుమేహాన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచేవారు. నిమోనియా తో బాధపడుతూ, పలురకాల ఇన్‌ఫెక్షన్లతో ఆహారం అరుగుదల క్షీణించిన చివరి రోజుల్లోనూ, ‘ఇక గుండె ఆగడం ఏ నిమిషమైనా జరగొచ్చు’అని కుటుంబీకులతో సాదాసీదాగా మాట్లాడిన నిబ్బ రత్వం ఆయనది. భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. 1942లో జన్మించిన ఆయన, దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి బాలుడే అయినా, స్వాతంత్య్రానంతర తొలి దశకాల ఆదర్శ వాతావరణ ప్రభావం ఆయన ‘ప్రజాస్వామ్య’ఆలోచనా సరళిని ఆవిష్కరించింది. గాంధీ, రాజగోపాలచారి, నెహ్రూ తననెంతో ప్రభావితం చేశారని చెప్పేవారు. స్థిరమైన సిద్ధాంత బలం ఆయన ఆస్తి! ‘రచయితలు, రాజకీయ నేతలు తమ ఆస్తులు–అప్పుల వెల్లడి కన్నా తమ సిద్ధాంత వైరుధ్యాల్ని ప్రకటించడం ముఖ్యం’అనేవారు.

కాంగ్రెస్‌లో కీలకస్థాయికి ఎదిగి, ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని వ్యతిరేకించి పార్టీని వీడిన సాహసం ఆయన సిద్ధాంత బలమే! సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ను, వారి అవినీతిని వ్యతిరేకిస్తూ దేశవిదేశాల్లో పెరుతెచ్చుకొని కూడా తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారేమని జర్నలిస్టులడిగిన ప్రశ్నకు సమాధానమే ఆయన నిబద్ధతకు నిదర్శనం. ‘జనతాదళ్‌ విచ్ఛిన్నమవడం వల్ల బీజేపీ బలపడుతోంది, అందుకే, ఇన్నేళ్లు నేను సంపాదించుకున్న వ్యక్తిగత పేరు–ప్రతిష్టల్ని కూడా పణంగా పెట్టి, నా సిద్ధాంతమైన లౌకికవాద పరిరక్షణ కోసం కాంగ్రెస్‌లో చేరాల్సివస్తోందన్నా’రు. ఎన్టీఆర్‌ను అక్రమం గా గద్దె దించినపుడు జరిగిన ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన, ‘ఇది ఎన్టీయార్‌ కోసం కాదు, ప్రజాతీర్పు వక్రీకరణకు గుణపాఠం, ప్రజాభిప్రాయానికి పట్టం’అని తన ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెల్లడించారు. 
దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, సాక్షి

మరిన్ని వార్తలు