పావు శాతం బీజీ–3 విషం!

31 Jul, 2018 01:34 IST|Sakshi

రాష్ట్రంలో బీజీ–3, నాసిరకం పత్తి విత్తనాల వెల్లువ

200 నమూనాలను పరీక్షించిన అధికారులు

అందులో 50 నమూనాలు బీజీ–3గా నిర్ధారణ

యంత్రాంగం నిర్లక్ష్యం.. కంపెనీల స్వైరవిహారం

పత్తి కంపెనీలతో అధికారుల చెట్టపట్టాల్‌.. ఇటీవల రహస్య భేటీ!

డీఎన్‌ఏ లేబొరేటరీపై దుష్ప్రచారం.. నిందితులు తప్పించుకునేందుకు సాయం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఇటీవలి అంచనా ప్రకారం రాష్ట్రంలో 15 శాతం విస్తీర్ణంలో నిషేధిత బీజీ–3 పత్తి సాగైంది. తాజాగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని డీఎన్‌ఏ లేబొరేటరీ జరిపిన పరీక్షల్లో 25 శాతం బీజీ–3 పత్తి పంట ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనా ప్రకారమే ఈ స్థాయిలో అనుమతిలేని బీజీ–3 పత్తి సాగైనట్లు తేలడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిషేధిత పత్తి విత్తనంపై ఉక్కుపాదం మోపుతామని బీరాలు పలికిన వ్యవసాయ యంత్రాంగం కనీసం తుప్పును కూడా వదిలించలేకపోయింది.   విత్తన కంపెనీలు రైతులకు బీజీ–3ని అంటగడుతుంటే, ‘సొరకాయ కోతల’కే అధికారులు పరిమితమయ్యారంటున్నారు. ఇప్పటివరకు 36 లక్షల ఎకరాలకు మించి పత్తి సాగైతే, దాదాపు 8 లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి విత్తనం వేసినట్లు అంచనా.  గ్లైపోసేట్‌ను నిషేధించడంతో ఇప్పుడు వేసిన బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఏ మందు వేయాలో రైతులకు తెలియక కలవరపడుతున్నారు.


ల్యాబ్‌పై దుష్ప్రచారం
వ్యవసాయ శాఖ దాని అనుబంధ విభాగాలకు చెందిన కొందరు అధికారులు పనిగట్టుకొని విత్తన కంపెనీలకు వంతపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మొదట్లో బీజీ–2 విత్తనంలో బీజీ–3 విత్తనాలను ఐదు శాతం కలిపేందుకు కేంద్రానికి విన్నవించేలా ప్రయత్నించారు. ఆ పాచిక పారలేదు. చివరకు బీజీ–3 విత్తనాలను అంటగట్టే కంపెనీలకు అనుగుణంగా కుట్ర చేసినట్లు తేలింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో ‘మలక్‌పేటలోని డీఎన్‌ఏ లేబొరేటరీకి బీజీ–3ని నిర్ధారించే సామర్థ్యం అంతగా లేదు’అని నమ్మించేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేసినట్లు విమర్శలు వచ్చాయి.

ఇటీవల కేంద్రం నిర్వహించిన సమావేశానికి తయా రు చేసిన నివేదికలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ‘హైదరాబాద్‌ మలక్‌పేట డీఎన్‌ఏ లేబరేటరీకి బీజీ–3ని నిర్ధారించే పటిష్టమైన అత్యాధునిక వసతులున్నాయి’అని కేంద్రం ఇచ్చిన ప్రశంసాపూర్వకమైన లేఖను వ్యవసాయ శాఖ వర్గాలు బయటపెట్టాయి. అంటే కావాలనే డీఎన్‌ఏ లేబొరేటరీపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీజీ–3 నిర్ధారణ పరీక్షలను సవాల్‌ చేసేలా విత్తన కంపెనీలను పురికొల్పడమే ఇందులో ప్రధాన కుట్ర అని వ్యవసాయ శాఖలోని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి.

రహస్య భేటీ
బీజీ–3ని సరఫరా చేసిన కంపెనీలు ఇటీవల హైదరాబాద్‌లో ఒక రహస్య భేటీ నిర్వహించాయి. కొందరు వ్యవసాయ అనుబంధ అధికారులు ఆ రహస్య భేటీకి హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీలను గట్టెక్కించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. ఇలా వ్యవసాయ శాఖ, దాని అనుబంధ విభాగాలకు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. కొందరు రైతులకు మద్దతు తెలుపుతుంటే, కొందరు కంపెనీలకు బాసటగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.  

డీఎన్‌ఏ లేబొరేటరీ పరీక్షలపై చర్చ
హైదరాబాద్‌ మలక్‌పేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ లేబొరేటరీకి ఈ ఏడాది 200 పత్తి నమూనాలను పరీక్షలకు పంపారు. వాటిని పరీక్షించగా అందులో 50 నమూనాలు బీజీ–3గా నిర్ధారించారు. అవన్నీ కూడా ప్రముఖ విత్తన కంపెనీలవే కావడం గమనార్హం. ఆయా కంపెనీలన్నీ రాష్ట్రంలో బీజీ–2 విత్తనాన్ని సరఫరా చేయడానికి అనుమతి పొందినవే. కానీ అవే నిషేధిత బీజీ–3ని కూడా రైతులకు సరఫరా చేశాయి.

వాస్తవంగా బీజీ–3 నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆలస్యం చేసింది. మొదట్లో బీజీ–2లో బీజీ–3 విత్తనాలను ఐదు శాతం కలుపుకునేందుకు అవకాశం కల్పించాలన్న కంపెనీలకు మద్దతు తెలిపేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖలో కొందరు ప్రయత్నాలు చేశారు. కానీ వ్యవహారం బయటపడటంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆ తర్వాత బీజీ–3పై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర అధికారులు కేంద్రానికి విన్నవించారు.

బీజీ–3ని నియంత్రించాలంటే దానికి వాడే గ్లైపోసేట్‌ పురుగు మందును ముందు నిషేధించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ కీలకమైన పత్తి సాగు ప్రారంభ సమయంలో నిషేధించకుండా, దాదాపు 70 శాతం సాగయ్యాక ఆలస్యంగా నిషేధమో, నియంత్రణో అర్థంగాకుండా ఆదేశాలిచ్చారు. దీం తో రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు బాగుపడింది బీజీ–3ని రైతులకు అంటగట్టిన కంపెనీలే.

మరిన్ని వార్తలు