వై దిస్‌ కొలవెరీ..!

24 Apr, 2019 07:22 IST|Sakshi

భారతీయ పురుషుల్లో ‘వై–క్రోమోజోమ్‌’ లోపాలతో వంధ్యత్వం

గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

తార్నాక: పురుషుల్లో అతి ముఖ్యమైన ‘వై–క్రోమోజోమ్‌’ దెబ్బతినడం వల్ల భారతీయ పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడుతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తేల్చారు. పురుషుల్లో వై–క్రోమోజోమ్‌లోని లోపం ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బ తీస్తున్నట్టు గుర్తించారు. దీనిపై రెండు దశాబ్దాలుగా  సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ (సీసీఎంబీ)లో చేస్తున్న పరిశోధనలు ఫలించాయి. మానవుల్లో వంధ్యత్వానికి పురుషుల్లో ఉండే వై–క్రోమోజోమ్‌లోని లోపాలే ప్రధాన కారణమని సీసీఎంబీకి చెందిన డాక్టర్‌ తంగరాజ్‌ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. భారతీయుల్లోని ప్రతి ఏడు జంటల్లో ఒకరు వంధ్యత్వానికి గురువుతున్నారని వారు గుర్తించారు. ముఖ్యంగా పురుషుల్లోని వై–క్రోమోజోమ్‌ అనేకరకాల జన్యువులను కలిగి ఉంటుంది.

అది స్పెర్మటోజెనిసిస్, శుక్రకణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్రపోషిస్తుంది. అయితే మగవారిలో ఆనారోగ్యం, గాయాలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు.. జీవనశైలి, పరిసరాల ప్రభావం వై–క్రోమోజోమ్‌ ఉత్పిత్తి చేసే శుక్రకణాలు విడుదలకు అడ్డంకులు కలిగిస్తాయని, ఈ కారణాలే  మగవారిలో వంధ్యత్వానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 8.5 శాతం కేసుల్లో ఈ లక్షణాలు బయటపడినట్టు వారు వెల్లడించారు. ప్రస్తుత అధ్యయనంలోౖ వై–క్రోమోజోమ్‌ల లోపాలపై సూక్ష్మ, స్థూల అధ్యయనాలు  చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అజూస్పెర్మా ఫ్యాక్టర్‌లోని మూడు పొడవైన వై–క్రోమోజోమ్‌ స్పెర్మటోజెనిసిస్‌లను ఉపయోగించి 587 మంది పరిపూర్ణమైన ఫెర్టిలిటీ గల వారు, 973 మంది వంధ్యత్వ లక్షణాలు గలవారిలోని శుక్రకణాల ఫలదీకరణపై పరిశోధన చేయగా, 29.4 శాతం భారతీయ పురుషుల్లో క్రోమోజోములు తగ్గిపోతున్నట్టు గుర్తించారు. వై–క్రోమోజోమ్‌ తొలగింపు అనేది ప్రత్యుత్పత్తి వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని వారు తేల్చారు. 

మరిన్ని వార్తలు