ఓరుగల్లులో ఇన్ఫోసిస్ క్యాంపస్

14 Feb, 2016 00:13 IST|Sakshi
ఓరుగల్లులో ఇన్ఫోసిస్ క్యాంపస్

♦ 19న సీఎం కేసీఆర్ శంకుస్థాపన
♦ చారిత్రక నగరానికి టెక్నాలజీ హంగు
♦ మైసూరు తరహాలో శిక్షణ కేంద్రం
♦ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధికి ఊతం
 
 సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రాష్ట్రంలో కొత్త వేదిక ఏర్పాటవుతోంది. చారిత్రక వరంగల్ నగరంలో ప్రఖ్యాత ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ ట్రైనింగ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండలో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 19న శంకుస్థాపనచేయనున్నారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఐటీ సేవల సంస్థల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఏటా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే ఈ సంస్థ... వారికి సంస్థ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తుంది. ఇందుకోసం కర్ణాటకలోని మైసూరులో పదేళ్ల క్రితం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 10 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు అనువుగా 350 ఎకరాల విస్తీర్ణంలో, అత్యాధునిక హంగులతో రెండు వేల గదులు, మల్టీఫ్లెక్స్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, ఫుడ్‌కోర్టు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో వరంగల్‌లోనూ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది.

 వరంగల్ ఎందుకంటే..
 ఇన్ఫోసిస్ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది. అయితే బెంగళూరుకు దీటుగా ఐటీ రంగంలో విస్తరిస్తున్న హైదరాబాద్‌ను మరో వేదికగా మలుచుకునేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇన్ఫోసిస్ కేంద్రంలో 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోచారం వద్ద 25 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా మరో కార్యాలయాన్ని నిర్మిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్‌కు హైదరాబాద్ సమీపంలోనూ శిక్షణ కేంద్రం ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగులకు గ్రేటర్ వరంగల్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్‌కు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కింద ప్రతిపాదించింది. ఇన్ఫోసిస్ దానికి అంగీకరించి.. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. వరంగల్ నగరం చెన్నై-న్యూఢిల్లీ రైలు మార్గంపై ఉండడం, ఆర్థికంగానూ తక్కువ ఖర్చు, ప్రకృతి విపత్తులపరంగా సురక్షితమైన నగరం కావడం కూడా ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడింది.

 ఐటీ రంగానికి ఊతం..
 రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ రంగల్‌లో ఇప్పటికే ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రం నిర్మాణాన్ని కూడా పూర్తిచేసింది. కాకతీయ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులో రెండేళ్లుగా 25 సార్టప్ కంపెనీలు పని చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ శిక్షణా కేంద్రం వస్తుండడంతో... ఇక్కడ ఐటీ రంగం పుంజుకోనుంది.
 
 సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
 ‘‘వరంగల్ నగరం ఐటీ రంగానికి కొత్త చిరునామాగా మారబోతోంది. ఇన్ఫోసిస్ శిక్షణ కేంద్రం దీనికి కీలక మలుపని భావించవచ్చు. సీఎం కేసీఆర్ ఈనెల 18న సాయంత్రం వరంగల్‌కు వస్తున్నారు. 19న ఉదయం మేడారం వెళ్లి వన దేవతలను దర్శించుకుంటారు. అనంతరం తిరిగి వరంగల్‌కు వచ్చి... ఇక్కడ ఇన్ఫోసిస్ ట్రైనింగ్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తారు..’’
   - వాకాటి కరుణ, వరంగల్ జిల్లా కలెక్టర్

మరిన్ని వార్తలు