ఇంజినీర్లదే తప్పు

22 Oct, 2014 03:48 IST|Sakshi
ఇంజినీర్లదే తప్పు

టవర్‌సర్కిల్ :
 శానిటేషన్ కార్మికుల నియామక టెండర్లలో అవకతవకలు నిజమేనని, ఇంజినీరింగ్ విభాగం అధికారులు తనను తప్పుదోవ పట్టించారని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేశ్ లట్కర్ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దశలో టెండర్లు కొనసాగించలేమ ని, తనకున్న అధికారాలతో టెండర్లు రద్దు చేస్తున్నానని వెల్లడించారు.

టెక్నికల్ బిడ్ తెరిచినప్పుడు అర్హత లేని ఏజెన్సీలను పక్కన పెట్టాల్సింది పోయి, ఆ సంస్థలకు చెందిన ఫైనాన్స్ బిడ్‌ను కూడా అధికారులు తెరిచారని చెప్పారు. తీవ్ర ఆలస్యం చేసిన అనంత రం ఫైల్ తన వద్దకు తీసుకొస్తే... నాలుగు కండీషన్లపై అనుమానాలున్నట్లు అధికారుల కు రాతపూర్వకంగా ఇచ్చానన్నారు. అయినప్పటికీ కచ్చితమైన వివరణ ఇవ్వకుండా తప్పుదోవ పట్టించడంతోనే తాను సంతకం చేసినట్లు స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మేయర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఇంజినీరింగ్ అధికారులు చేసిన తప్పిదాలతో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని పేర్కొన్నారు. తప్పులు చేసిన ఎస్‌ఈ, ఇద్దరు ఈఈలకు వివరణ నోటీసులు అందజేసినట్లు తెలిపారు. ఆరు రోజుల్లో ఇంజినీర్లు ఇచ్చే వివరణను చర్యల కోసం ఈఎన్‌సీకి సిఫారసు చేస్తానన్నారు. టెండర్లు రద్దు మినహా ఏం చేయలేమన్నారు.

మళ్లీ టెండర్ ప్రక్రియ నెలరోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అప్పటివరకు పాత టెండర్ పొడిగింపు ఇచ్చే విషయంపై చర్చించాల్సి ఉందన్నారు. కార్పొరేటర్లు, వారి రక్తసంబంధీకులు టెండర్లలో పాల్గొంటున్నారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని... ఇవి అన్ని టెండర్లకు వర్తిస్తాయని తెలిపారు.

 పాత కండీషన్లతోనే కొత్త టెండర్లు
 రద్దయిన టెండర్లలోని కండీషన్లతోనే మళ్లీ కొత్త టెండర్లు నిర్వహిస్తామని మేయర్ రవీం దర్‌సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు అత్యవసరమైన శానిటేషన్‌లో ఇబ్బందులు రాకుం డా చూస్తామన్నారు. నగరంలో పారిశుధ్య పనులతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మరింత మెరుగైన పారిశుధ్య నిర్వహణకోసం చర్యలు తీసుకుంటామన్నారు. టెండర్లలో నిబంధనలను అతిక్రమించడం వల్లే రద్దుకు సిఫారసు చేయాల్సి వచ్చిందన్నారు. త్వరలోనే మళ్లీ టెండర్లు నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు