బ్యాలెట్‌పై ముందే సిరా గుర్తు!

23 Jan, 2020 11:27 IST|Sakshi

అధికారులకు ఓ యువతి ఫిర్యాదు

రాజేంద్రనగర్‌: బ్యాలెట్‌ పేపర్‌లో ఓ అభ్యర్థి గుర్తుపై ముందే సిరాగుర్తు ఉండటంతో వివాదాస్పదమైంది. బుధవారం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. మున్సిపల్‌ పరిధి 20వ డివిజన్‌కు చెందిన ఐశ్వర్య తొలిసారి ఓటు వేసేందుకు కుటుంబీకులతో కలిసి బండ్లగూడ సరస్వతీ విద్యాలయంలోని పోలింగ్‌ బూత్‌కు వచ్చింది. దీంతో అధికారులు ఆమెకు బ్యాలెట్‌ పేపర్‌ను ఇచ్చారు. బ్యాలెట్‌పై అప్పటికే కారు గుర్తుపై సిరాతో ముద్ర వేసి ఉంది. దీంతో ఐశ్వర్య అభ్యంతరం వ్యక్తం చేసి ప్రిసైడింగ్‌ అధికారికి విషయం తెలిపి మరో బ్యాలెట్‌ పేపర్‌ కావాలని చెప్పాడు. ఓ వృద్ధుడు పొరపాటున బ్యాలెట్‌ పేపర్‌పై వేలి ముద్ర వేశాడని సముదాయించి అదే బ్యాలెట్‌ పేపర్‌తో ఓటు వేయించారు. ఐశ్వర్య మాత్రం తనకు అన్యాయం జరిగిందని, తన ఓటు చెల్లకుండా పోయిందని ఆరోపిస్తూ అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌ నాయక్, బండ్లగూడ ఆర్వో కృష్ణమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. అధికారులు ఆమెను సముదాయించి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. వేసిన ఓటు తప్పకుండా చెల్లుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

ముందే ఓటేశారు..  
బ్యాలెట్‌ పేపర్లలోని కారు గుర్తుపై ముందే సిరా గుర్తుతో ఓటు వేశారని 20వ డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అభిలాష్‌ ముదిరాజ్‌ ఆరోపించారు. తాను మొదటి నుంచే బ్యాలెట్‌ పేపర్లను పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని, పోలీసులు తనను పోలింగ్‌ బూత్‌ వద్దకు రానివ్వలేదని మండిపడ్డారు. బ్యాలెట్‌ పేపర్లలోని కారు గుర్తుపై మందే సిరా ముద్రలు ఉన్నాయని చాలామంది తనకు ఫిర్యాదు చేశారని అభిలాష్‌ తెలిపారు. ఓడిపోతామనే భయంతో పోలీసులు, పొలింగ్‌ సిబ్బందితో టీఆర్‌ఎస్‌ నేతలు  కుమ్మక్కై ఇలా చేశారన్నారు. ఐశ్వర్య ఫిర్యాదు తన ఆరోపణలకు బలం చేకూరిందని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు