అహో టీ హబ్..!

27 Oct, 2017 00:21 IST|Sakshi

భాగ్యనగరానికే తలమానికం..

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. భాగ్యనగరానికి తలమానికంగా, దేశంలోనే వినూత్న నిర్మాణ శైలిలో ఇంజనీరింగ్‌ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. స్టార్టప్స్‌కు (అంకుర పరిశ్రమలు) కొంగు బంగారంగా మారిన రాయదుర్గం ప్రాంతంలో టీహబ్‌ రెండో దశ భవనం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా టవర్స్‌ నిర్మాణ శైలిని పోలిన రీతిలో ఈ అధునాతన భవంతి నిర్మాణం జరుగుతోంది. సుమారు 10(9+1) అంతస్తులు.. 60 మీటర్ల ఎత్తు.. 90 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణం పనులు వడివడిగా జరుగుతున్నాయి. 3 లక్షల చదరపు అడుగుల వైశాల్యం.. 2 లక్షల చదరపు అడుగుల సువిశాలమైన పార్కింగ్‌ సదుపాయంతో దాదాపు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో కేపీసీ సంస్థ ఈ పనులు చేపట్టింది. గత ఆరు నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో స్టార్టప్స్‌తోపాటు ఇంక్యుబేషన్‌ ల్యాబ్‌ ఉపాధి కల్పన వంటి అంశాల్లో 3 వేల మంది పనిచేసేందుకు వీలుగా అంతస్తులు నిర్మించనున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఈ పనులను వచ్చేఏడాది అక్టోబర్‌ నాటికి పూర్తి చేయనునున్నారు.

బుర్జ్‌ ఖలీఫా తరహాలో..
దుబాయ్‌లో 163 అంతస్తుల ఎత్తున నిర్మించిన బుర్జ్‌ ఖలీఫా టవర్స్‌ నిర్మాణ శైలి తరహాలో ఈ భవంతి నిర్మాణం ఉంటుంది. బుర్జ్‌ దుబాయ్‌ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న తిరుచ్చి(కేరళ)కి చెందిన ఎవర్‌సాండై కంపెనీ ప్రతినిధులే టీహబ్‌ రెండో దశ భవన నిర్మాణంలోనూ పాలుపంచుకుంటుండటం విశేషం.

3ఈ నిర్మాణ శైలి..
నిర్మాణంలో చేపట్టిన వినూత్న విధానాలు, ఆధునిక ఇంజనీరింగ్‌ ప్రమాణాలు ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనవి కావడంతో ఈ భవనాన్ని 3డీ నిర్మాణంగా భావిస్తున్నారు. భవన రూపకల్పన, నిర్మాణ విశ్లేషణను ‘ఈటీఏబీఎస్‌ వి 15.2.2’ అనే నూతన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం ద్వారా రూపొందించారు. నిర్మాణ ప్రమాణాల విషయానికి వస్తే ఐఎస్‌ 456–2000 ప్రకారం బీములు, ఆర్‌సీసీ గోడలు, స్తంభాలను రూపకల్పన చేశారు. భూకంపాలను తట్టుకునే స్థాయిలో ఐఎస్‌ 1893–2002 ప్రమాణాల ప్రకారం నిర్మించారు. ఈ టవర్ల నిర్మాణ పనితీరుకు రెస్పాన్స్‌ స్పెక్ట్రం విశ్లేషణ నిర్వహిస్తుండటం విశేషం. ప్రామాణిక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి గోడలు, శ్లాబులు, మెట్లు, పునాదులను డిజైన్‌ చేశారు.

అధిక ఒత్తిడిని తట్టుకునేలా..
రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీటు మిశ్రమంతో ఏర్పాటు చేసిన బీం శ్లాబ్‌ పద్ధతిన పునాది నుంచి రెండో అంతస్తు వరకు నిర్మిస్తున్నారు. మూడో అంతస్తు నుంచి టెర్రస్‌ వరకు అధిక ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా స్టీలు ఫ్రేం(వీరెండిల్‌ గర్డర్స్‌) ఏర్పాటు చేస్తారు. ప్రతి అంతస్తుకు సంబంధించిన శ్లాబ్‌ను డెక్‌శ్లాబ్‌ విధానంలో పటిష్టంగా
నిర్మించనున్నారు.

9,000 టన్నుల స్ట్రక్చరల్‌ స్టీల్‌
ఈ భవంతిని అత్యాధునిక ఇంజనీరింగ్‌ డిజైన్లు, సాంకేతికత ఆధారంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ శైలి ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. భవన నిర్మాణంలో నాలుగు పిల్లర్ల ఆధారంగా రెండు పునాదులు.. గ్రౌండ్‌ఫ్లోర్‌.. దానిపై పలు అంతస్తులతో స్టీలు భవంతిని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో 9 వేల టన్నుల స్ట్రక్చరల్‌ స్టీల్, మరో 2500 టన్నుల రీఇన్‌ఫోర్స్‌ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో కాంక్రీటు నిర్మాణం 25 వేల క్యూబిక్‌ మీటర్లు కావడం విశేషం. 7 వేల క్యూబిక్‌ మీటర్ల మేర పునాదిని 26 గంటల సమయంలో పూర్తి చేయడం ఇంజనీరింగ్‌ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ పనుల్లో 25 మంది ఇంజనీర్లు.. 200 మంది కార్మికులు పాల్గొంటున్నారు.

ఒక్కో అంతస్తు.. ఒక్కో ప్రత్యేకత
గ్రౌండ్‌ఫ్లోర్‌:
వీక్షకులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది. చక్కటి ఆహ్లాదకరమైన ఆకుపచ్చని గోడలు, ప్రకృతి రమణీయ హరిత దృశ్యాలు, ప్రవేశ ద్వారం, ఆరుబయట సేదదీరేందుకు విశాలమైన పచ్చిక బయలు, వివిధ సౌకర్యాలు ఈ ఫ్లోర్‌ సొంతం.

1 అంతస్తు
విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ ఫ్లోర్‌ నిర్మాణ శైలి ఉంటుంది. ఇంక్యుబేషన్‌ కేంద్రంతోపాటు భవనంలో జరిగే రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది.

2 అంతస్తు
విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ ఫ్లోర్‌ నిర్మాణ శైలి ఉంటుంది. ఇంక్యుబేషన్‌ కేంద్రంతోపాటు భవనంలో జరిగే రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది.

3,4 అంతస్తులు
అంకుర పరిశ్రమలు, ఐటీ, బీపీవో, కేపీవో, సేవారంగానికి చెందిన వివిధ కార్యాలయాల ఏర్పాటు, సమావేశాలు, చర్చల నిర్వహణకు అవసరమైన హంగులుంటాయి. ఆకుపచ్చని మొక్కలు, హరితతోరణంతో అలరారే ఈ ఫ్లోర్లలో వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అనువైన పరిస్థితులుంటాయి.

5 అంతస్తు
ప్రశాంతతకు చిహ్నంగా నిలిచే అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. చిన్నచిన్న కాలిబాటలు.. నీటి సెలయేర్లు.. అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేస్తారు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తుంది ఈ అంతస్తు.

6,7 8,9 అంతస్తులు
ఇందులో వివిధ కార్యాలయాలు, స్టార్టప్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉద్యోగులకు ఆనందం, ఆహ్లాదం ఇచ్చేలా వసతులుంటాయి. ఉద్యోగులకు ఆటవిడుపు.. ఇన్‌డోర్‌ గేమ్స్, జిమ్‌లు, క్యాంటీన్‌లు, ఫుడ్‌ కోర్టులు, కెఫిటేరియాలు ఇందులో ఉంటాయి.

మరిన్ని వార్తలు