విష్ణు సహస్రనామావళితో పరివర్తన

4 Feb, 2020 05:14 IST|Sakshi

అమెరికాలోని ఓ తెలుగు అర్చకుడి వినూత్న ప్రయోగం

నిత్యం వాట్సాప్‌ గ్రూపులో ఓ నామం అర్థంతో వీడియో

సాక్షి, హైదరాబాద్‌: ఎంఎస్‌ సుబ్బులక్ష్మి ఆలపించిన విష్ణు సహస్రనామ స్తోత్రం వింటుంటే మనసులోని అలజడులు అదృశ్యమై ప్రశాంతత చేకూరుతుందనే వారి సంఖ్య ఎక్కువే. అందుకే ఉదయం వేళ చాలామంది ఇళ్లలో విష్ణు సహస్ర నామావళి వినిపిస్తూ ఉంటుంది. కానీ, వాటి పఠనం వినసొంపుగానే ఉన్నా, చాలామందికి దాని తాత్పర్యం మాత్రం తెలియదు. తాత్పర్యం తెలిస్తే, ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేలా మనసు కొత్తగా మారిపోతుందంటున్నారు గట్టు వేణుగోపాలా చార్య. అమెరికాలోని ఆర్కన్సాస్‌ రాష్ట్రం బెంటన్‌విల్లె సిటీలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఆయన.. విష్ణు సహస్ర నామావళి తాత్పర్యంతో సహా జనంలోకి చేరాలని కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

విష్ణు సహస్ర నామాల్లోంచి నిత్యం ఓ నామాన్ని దాని తాత్పర్యంతో వివరిస్తూ ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో దాన్ని అన్వయించుకునే విధానాన్ని వివరిస్తూ ఒక నిమిషం పాటు ఉన్న వీడియోను ఆయన వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేస్తారు. ఆ గ్రూపు సభ్యులు ఆ వీడియోను చూసి నామాన్ని పఠించి, దాని తాత్పర్యాన్ని మననం చేసుకోవాలి. దీన్ని ఓ తపస్సులాగా భావించాలని, అలా విష్ణు సహస్ర నామాలను రోజుకు ఒకటి చొప్పున వేయి రోజుల పాటు జనంలోకి తీసుకెళ్తానని చెబుతున్నారు. దీనికి ఇప్పటికే అమెరికా, భారత్‌ సహా ఇతర దేశాలకు చెందిన వేల మంది భక్తులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. భీష్ముడే పాండవులకు ఉపదేశించినట్లుగా ఆ నామాలను వేదవ్యాసుడు అందించాడని పురాణాలు చెబుతున్నాయి. భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్ర నామావళి అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నందున ఈనెల 5న భీష్మ ఏకాదశి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు