‘ఐ లవ్‌ మై జాబ్‌’ 

18 Jul, 2019 01:45 IST|Sakshi

పాఠశాల విద్యలో వినూత్న కార్యక్రమం..  

ఆచరణతోపాటు వ్యాసరచన పోటీల నిర్వహణ 

ఉత్తమ వ్యాసాలు రాసిన 107 మందికి 20న సన్మానం 

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యలో వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల్లో తాము చేస్తున్న వృత్తి పట్ల అంకితభావం పెంపొందిం చేందుకు ‘ఐ లవ్‌ మై జాబ్‌’, ‘యాక్ట్‌ నౌ’వంటి కార్యక్రమాలను చేపట్టింది.విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఆలోచన మేరకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యా కార్యాలయాల్లో ‘ఐ లవ్‌ మై జాబ్, యాక్ట్‌ నౌ’ల బోర్డును ఏర్పాటు చేసింది. తద్వారా అధికారులు, సిబ్బందిలో వృత్తి పట్ల అంకిత భావం పెంపొందించవచ్చన్నది ఉద్దేశం.అంతేకాదు ‘ఐ లవ్‌ మై జాబ్‌’అంశంపై ఉపాధ్యాయులు, అధికారులకు వ్యాస రచన పోటీలు నిర్వహించింది.

పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరిగాయి. అందులో జిల్లా స్థాయిలో ఉత్తమ వ్యాసాలు రాసిన ఉపాధ్యాయులను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఉత్తమంగా నిలిచిన వ్యాసాలు రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికయ్యాయి. రాష్ట్ర స్థాయికి వచ్చిన వ్యాసాల్లో ప్రతి భాషలో మూడు (ప్రథమ, ద్వితీయ, తృతీయ) వ్యాసాలను ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు.. వాటిని రాసిన ఉపాధ్యాయులతోపాటు, జిల్లా స్థాయిలో ఆయా భాషల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 107 మందిని ఈనెల 20న సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొననున్నారు. 

మరిన్ని వార్తలు