సోనియా సూచన సరైంది కాదు..

9 Apr, 2020 02:32 IST|Sakshi

‘మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రద్దు’పై ఐఎన్‌ఎస్‌  

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్ల పాటు ప్రభుత్వం మీడియాకు ఇచ్చే ప్రకటనలపై నిషేధం విధించాలని ఏఐసీసీ చీఫ్‌ సోనియా గాంధీ ప్రధానికి చేసిన సూచనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఢిల్లీలో ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) సోనియా సూచనను తీవ్రంగా ఖండించింది. మీడియా ద్వారా ఉన్న బహుళ ప్రయోజనాల దృష్ట్యా ఆమె చేసిన సూచనను ఉపసంహరించుకోవాలని ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడు శైలేష్‌ గుప్తా కోరారు. ఇది ప్రతికా రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నారు. ప్రకటనల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం చాలా తక్కువేనని.. అయినా అది వార్తాపత్రిక రంగానికి ఎంతో చేయూతనిస్తోందని అన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన వేజ్‌ బోర్డు మేరకు ఉద్యోగులకు జీతాలిస్తున్న రంగం ప్రింట్‌ మీడియానేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఫేక్‌ న్యూస్‌ను అరికట్టడానికి, ప్రభుత్వ, ప్రతిపక్షాల అభిప్రాయాలను దేశంలోని ప్రతి మూలకు ఉన్నది ఉన్నట్టుగా చేరవేసేందుకు ప్రింట్‌ మీడియానే ఉత్తమ వేదిక అని చెప్పారు. ఆర్థిక మాంద్యం, డిజిటల్‌ ప్రభావం కారణంగా ప్రకటనలు లేక ఆదాయం తగ్గి పత్రికా రంగం ఇప్పటికే క్షీణించిందన్నారు. ‘కరోనా’ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయన్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ప్రాణాలు తెగించి మీడియా ప్రతినిధులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రద్దు సలహాను సోనియా ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని శైలేష్‌ గుప్తా విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు