రాజ్యాంగం.. ఓ కరదీపిక

26 Nov, 2019 09:51 IST|Sakshi

భారత రాజ్యాంగ రచన సంక్లిష్టం

నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం కథనం

సాక్షి, ఖమ్మం : సుదీర్ఘకాలం పరాయి పాలనలో మనదేశం ఉన్నది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర భారతంగా అవతరించింది. ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఈ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశానికంటే ముందే అనేక దేశాలు రాజ్యాంగాలను రచించాయి.  

భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం. దీనికి కారణం దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన, పీడనకు గురైన వర్గాలు ఉన్నారు. వీరి ఆకంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్‌ లాంటిది.ఈ నేపథ్యంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సారధిగా కమిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ రూపకర్తఅంబేడ్కర్‌ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. కమిటీలోని ఆరుగురు సభ్యులు మేథోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. 1947 నవంబర్‌ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది.

కులాలు, విభిన్న మతాలు, రకరకాల ఆచార వ్యవహారాలు సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పన రాజ్యాంగ బద్ధం చేశారు. అంబేడ్కర్‌ చైర్మన్‌గా ఉన్న కమిటీలో పండిత్‌ గోవింద్‌ వల్లభ్‌పంత్, కె.ఎం.మున్నీ, అల్లాడి కృష్ణస్వామిఅయ్యర్, ఎన్‌.గోపాలస్వామి, అయ్యంగార్, బీఎల్‌.మిట్టర్, ఎండీ సాదుల్లా, డీపీ.ఖైతావ్‌ సభ్యులుగా ఉండగా.. ఖైతావ్‌ మరణం అనంతరం టీటీ కృష్ణమాచారి  పర్యవేక్షణలో రెండు సంవత్సరాల 11నెలల 11 రోజులు కష్టపడి తయారు చేసిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26న డాక్టర్‌ బాబు రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రతిపాదించి ప్రవేశపెట్టారు. 

2015 నుంచి రాజ్యాంగ  దినోత్సవం..
కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్‌ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో ఈ రోజు రాజ్యాంగం గురించి తెలిసిన అనుభవజ్ఞులచే ఉపన్యాసాలు, వ్యాసరచన తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ రాజ్యాంగం ఏర్పడిన 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగం ఆమోదిత దినోత్సవాన్ని 2015, నవంబర్‌ 26న జరుపుకుంది. రాజ్యాంగం పీఠిక ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం. మన రాజ్యాంగాన్ని మరింతగా తెలుసుకునేలా ఈ రోజు మనకు స్ఫూర్తినివ్వాలి.

మరిన్ని వార్తలు