ఎవరిదో దత్తత అదృష్టం

2 Oct, 2019 10:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మండలానికో ఛేజింగ్‌ అధికారి నియామకం

30రోజుల ప్రత్యేక పనుల పురోగతిపై తనిఖీ

మరో 4 రోజుల్లో ముగియనున్నకార్యాచరణ పనులు

ప్రతీ గ్రామంలో పర్యటన

గ్రామస్తుల నుంచే వివరాల సేకరణ

సాక్షి, జనగామ: ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో సమస్త గ్రామాలు..సకల జనులు ఒక ఉద్యమంలాగా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. తమ ఇంటి నుంచే కాకుండా గ్రామస్తులకు ఉపయోగపడే పనుల్లో పాలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు.. ప్రత్యేక అధికారులు.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామంలో ఉండే ప్రతిఒక్కరూ తమకు తాముగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి యజ్ఞంలో పా ల్గొని స్ఫూర్తి నింపారు. ఏ పల్లెకు ఆ పల్లె పనులు చేపట్టి భేష్‌ అనిపించుకున్నారు. కానీ జిల్లాలో దత్తత అదృష్టం ఏ గ్రామం తలుపు తట్టనుందో. ప్రభుత్వ దత్తత అవకాశం ఏ గ్రామానికి దక్కుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ప్రభుత్వం గ్రామాల్లో మార్పు తీసుకురావడం కోసం 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ పనులను చేపడుతోంది. 30 రోజుల ప్రత్యేక పనులను సక్రమంగా నిర్వహించే గ్రామాలను ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది. నిధులను ఇచ్చి అభివృద్ధి చేస్తుంది’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సెప్టెంబర్‌ నాలుగో తేదీన జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాప్రతినిధులు, అధికారుల అవగాహన సదస్సులో స్పష్టంచేశారు. పనులు ముగింపు దశకు చేరుకోవడంతో ప్రభుత్వ దత్తతకు ఎంపికయ్యే ఏ గ్రామ పంచాయతీ అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

తనిఖీ అధికారుల టీం ఇదే..
జిల్లాలో కొనసాగుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ పనులను పరిశీలించడానికి 12 మంది అధికారులతో కూడిన తనిఖీ టీంను నియమించారు. ఒక్కొక్క మండలానికి జిల్లా స్థాయి అధికారిని ఒక్కరి చొప్పున నియమించారు. జనగామ మండలానికి విశ్వ ప్రసాద్‌ (కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌), బచ్చన్నపేట మండలానికి టీవీఆర్‌ మూర్తి (కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌), లింగాలఘనపురం మండలానికి మన్సూరీ(కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌), దేవరుప్పుల మండలానికి వీరస్వామి (కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌), తరిగొప్పుల మండలానికి రవికిరణ్‌ (డిప్యూటీ తహసీల్దార్‌), రఘునాథపల్లి మండలానికి అబ్దుల్‌ (డీఏఓ ఆర్డీఓ కార్యాలయం), స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలానికి సలీమ్‌ (తహసీల్దార్‌), చిల్పూర్‌ మండలానికి శంకర్‌ (డిప్యూటీ తహసీల్దార్‌), పాలకుర్తి మండలానికి వంశీ (కలెక్టరేట్‌ సీనియర్‌ అసిస్టెంట్‌), జఫర్‌గఢ్‌ మండలానికి షకీర్‌ (ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌), కొడకండ్ల మండలానికి రాజు (ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌)లను నియమించారు. ఈ టీం అధికారులు ఇప్పటి వరకు గ్రామాల్లో జరిగిన 30 రోజుల పనుల వివరాలను సేకరిస్తారు. నేరుగా గ్రామానికి వెళ్లి గ్రామస్తులతోనే మాట్లాడి పనుల అమలుపై ఆరా తీస్తారు. జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించి పనుల, ఆయా పంచాయతీల్లో తయారు చేసిన నివేదికలను పరిశీలిస్తారు. 

మరో 4 రోజులే..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ పనులు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నాయి. సెప్టెంబర్‌ ఆరో తేదీన ప్రారంభమైన పనులు ఈ నెల ఆరో తేదీతో ముగియనున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లోని 281 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, శ్రమదానాలు, కరెంటు స్తంభాల ఏర్పాటు, దోమల నివారణ చర్యలు, శిధిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత, నిరుపయోగంగా ఉన్న బావులు, బోరు బావుల పూడ్చివేత వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటడంతో పాటుగా శ్రమదానాలు నిర్వహిస్తున్నారు. స్పెషలాఫీసర్లు గ్రామాల్లో పల్లె నిద్ర సైతం చేశారు. ప్రత్యేక పనులు ముగింపు దశకు చేరడంతో మిగిలిపోయిన పనులు పూర్తిస్థాయిలో చేపట్టడానికి అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు