సచివాలయ భవనాల పరిశీలన

13 Jul, 2019 07:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సచివాలయంలోని ప్రస్తుత భవనాల వాస్తవ పరిస్థితి, వాటి పటుత్వాన్ని తెలుసుకునేందుకు అధికారులు పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ సచివాలయం కొనసాగుతున్న ఏ, బీ, సీ, డీ బ్లాక్‌లు, ఇటీవలి వరకు ఏపీ అధీనంలో ఉన్న హెచ్, జే, కే, ఎల్‌ బ్లాకులతో పాటు శిథిలావస్థకు చేరిన జీ బ్లాక్‌ భవనాలను పరిశీలించారు. సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం ఆదేశంతో, అధికారుల కమిటీ సభ్యులు గణపతిరెడ్డి, మురళీధర్‌రావు, రవీందర్‌రావు, సత్యనారాయణరెడ్డిలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జీ బ్లాక్‌ మినహా మిగతా భవనాలను పరిశీలించారు. నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రమణారావు ఆధ్వర్యంలో భవనాల పటుత్వాన్ని పరిశీలించారు. ప్రస్తుతం కార్యకలాపాలు సాగుతున్న ఏ, బీ, సీ, డీ బ్లాకులన్నీ బాగున్నా.. ఏపీ ప్రభుత్వం అధీనంలో ఇటీవలి వరకు ఉన్న హెచ్, జే, కే, ఎల్‌ బ్లాకు భవనాలు చాలాకాలంగా వినియోగంలో లేవు.

ఇటీవల వాటిని తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ భవనాల్లోని కార్యాలయాలను అమరావతికి తరలించే సమయంలో కొన్ని కార్యాలయాల్లో ఫ్యాన్లు, స్విచ్‌ బోర్డులు కూడా తీసుకుపోయారు. దీంతో కొన్ని గోడలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి మినహా మిగతా భవనాలన్నీ పటుత్వంగానే ఉన్నట్టు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుత సచివాలయ భవనాలను ఏం చేయాలనే విషయంలో స్పష్టత కోసం మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు త్వరలో భవనాల పటుత్వంపై నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే వాటిని కూల్చొద్దంటూ హైకోర్టును పలువురు ఆశ్రయించిన నేపథ్యంలో.. కోర్టుకు తెలిపేందుకు కూడా ప్రభుత్వానికి నివేదిక అవసరం.

>
మరిన్ని వార్తలు