గులాబీ పార్టీలో సంస్థాగత వేడి

29 Oct, 2016 03:31 IST|Sakshi
గులాబీ పార్టీలో సంస్థాగత వేడి

జిల్లా కమిటీల నియామకంపై కసరత్తు
ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు
కమిటీల్లో మహిళలకు పెద్ద పీట
టీఆర్‌ఎస్ నేతలకు నేడో, రేపో తీపి కబురు

సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో సంస్థాగత రాజకీయం వేడెక్కింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పార్టీ కమిటీల నియామకంపై టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే దీపావళి వరకు పార్టీ జిల్లా కమిటీలను, అనుబంధ సంఘాల కమిటీల నియామకాలను పూర్తి చేయాలని నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లా కమిటీల కూర్పు ఎలా ఉండాలో నిర్ణయించిన సీఎం కేసీఆర్, ఆ మేరకు ఆయా జిల్లాల నుంచి ప్రతిపాదలను సిద్ధం చేసి జాబితాలు ఇవ్వాలని జిల్లాల మంత్రులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్, నల్లగొం డ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ పాత జిల్లాల పరిధిలోని కొన్ని కొత్త జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు, ముఖ్యనేతల భేటీలు జరిగాయి.జిల్లా అధ్యక్షుల విషయం తనకు వదిలేసి కార్యవర్గాల ప్రతిపాదనల జాబితాలందజేయాలని సీఎం సూచించి నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సామాజిక సమీకరణలతో కూర్పు
జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి స్థాయిలో సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని భర్తీ చేయాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోందని అంటున్నారు. ఈ కారణంగానే మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారని సమాచారం. కాగా, ఇప్పటికే అటు పాత జిల్లాల్లో అధ్యక్షులుగా ఉన్న కొందరిని కొనసాగించడమా, లేదా వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించడమా అన్న చర్చకూడా జరిగింద ని తెలుస్తోంది. మొత్తంగా 31 జిల్లాలకు అధ్యక్షులను, కార్యవర్గాలను ప్రకటించాలని, అదీ ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి చేయాలన్న లక్ష్యంతో పార్టీ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

కొన్ని జిల్లాలు మినహా అత్యధిక జిల్లాల్లో ప్రతిపాదనలను సీఎంకు అందజేశారంటున్నారు. కాగా శుక్రవారం ఉదయం నుంచి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ముఖ్య నేతలు కొందరితో కమిటీల కూర్పు, తదితర అంశాలపై చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దీపావళి తర్వాత మరికొన్ని నామినేటెడ్ పదవులనూ భర్తీ చేసే యోచనలో సీఎం ఉన్నారని, వీటిపైనా చర్చ జరిగిందని అంటున్నారు.
 
మహిళలకు 33 శాతం రిజర్వేషన్?

పార్టీ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఆ మేరకు ఆయా సంస్థాగత పదవులకు వారిని ఎంపిక చేయాలని చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్ష పదవుల్లో కూడా వారికి అవకాశం కల్పించనున్నారని పేర్కొంటున్నారు. కాగా ఈ సారి పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలకూ అవకాశం దక్కనుందని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో అధ్యక్ష పదవులకు డిమాండ్ ఉండగా, మరికొన్ని చోట్ల నేతలు పెద్దగా ముందుకు రావడం లేద ని చెబుతున్నారు. జిల్లా కమిటీలకోసం ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురు పేర్లను సిద్ధం చేశారని తెలుస్తోంది. జిల్లా కమిటీలు, కార్యవర్గాలను శనివారం నాటికే ప్రకటించనున్నారని సమాచారం. ఇక అనుబంధ సంఘాల కమిటీలన్నింటినీ గంప గుత్తగా ఒకే సారి ప్రకటించనున్నారని సమాచారం.

>
మరిన్ని వార్తలు