కనికరించని ‘సఖి’

22 Jun, 2018 02:42 IST|Sakshi

ఆశ్రయం కోసం బాలిక అగచాట్లు

మేడ్చల్‌ జిల్లాలో పదిహేడేళ్ల గర్భవతికి అవమానం

సాక్షి, హైదరాబాద్‌: పదిహేడేళ్ల బాలిక.. పైగా గర్భవతి. నా అనేవారు లేరు.. ఓ కామాంధుడి మాయమాటలు నమ్మి మోసపోయి గర్భం దాల్చింది. తలదాచుకునే చోటు లేదు. ఆశ్రయం కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సఖి కేంద్రానికి వెళ్లగా సిబ్బంది కనికరించలేదు. క్లిష్టపరిస్థితుల నుంచి వచ్చిన బాలికలు, మహిళలను ఎలాంటి సిఫారసు లేకుండా ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సఖి(ఒన్‌ స్టాప్‌ సెంటర్‌) కేంద్రం మానవత్వం మరిచింది. సిబ్బంది ఉదాసీన వైఖరితో ఏడు నెలల గర్భవతి అయిన బాలిక ఘోర అవమానం ఎదుర్కొంది.

వివరాలు... మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏడు నెలల గర్భంతో ఉన్న పదిహేడేళ్ల అనాథ బాలిక ఆశ్రయం కోసం ఈ నెల 20న పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి ఆశ్రయం కల్పించి న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆశ్రయం కోసం ఉమ్మడి జిల్లాలో ఉన్న సఖి కేంద్రం నిర్వాహకులను సంప్రదించారు.

సీడబ్ల్యూసీ(చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ) ఆమోదం ఉంటేనే ఆశ్రయం కల్పిస్తామని, వారిని సంప్రదించాలని నిర్వాహకులు సలహా ఇచ్చారు. దీంతో సదరు పోలీసు అధికారి సీడబ్ల్యూసీ చైర్మన్‌ను ఫోనులో సంప్రదించగా వెల్ఫేర్‌ కమిటీ ఆమోదంతో కూడిన లేఖను మరుసటి రోజు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. సీడబ్ల్యూసీ సిఫారసు లేఖ లేకపోవడంతో ఆ బాలికకు సఖి నిర్వాహకులు ఆశ్రయం ఇవ్వలేదు. 

దీంతో ఆ పోలీసు అధికారి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ  అధికారులను సంప్రదించారు. చివరగా ఉప్పల్‌ సమీపంలోని ఓ చోట ఆశ్రయం కల్పించారు. ప్రమాదానికి గురైన బాధిత మహిళ/బాలిక సఖి కేంద్రానికి వస్తే తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స ఇవ్వాలి. ఇందుకు సఖి కేంద్రంలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఆ తర్వాత బాధితురాలికి ఆశ్రయం ఇవ్వడంతోపాటు కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. తర్వాత వసతులు కల్పించి న్యాయసహకారం అందించాలి.

మరిన్ని వార్తలు