89 శాతం రైతులు సంతోషంగా ఉన్నారు: కేసీఆర్‌

4 Jun, 2018 14:49 IST|Sakshi
రైతుబీమా పథకం కోసం ప్రభుత్వం-ఎల్‌ఐసీల మధ్య అవగాహనా ఒప్పందం.

సాక్షి, హైదరాబాద్‌: తమది రైతుపక్షపాత ప్రభుత్వమని, రాష్ట్రంలో అమలవుతోన్న రైతుబంధు పథకం ద్వారా 89 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రతిష్టాత్మక రైతుబీమా పథకం ఆగస్టు 15 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం-లైఫ్‌ ఇన్సురెన్స​ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ)లు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌, ఇతర మంత్రులు, ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ తదితరులు పాల్గొన్నారు.

రైతుబీమా విధివిధానాలు: ఎల్‌ఐసీతో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ రైతుబీమా పథకం విధివిధానాలను క్లుప్తంగా వివరించారు.
2018 ఆగస్టు 15 నుంచి రైతుబీమా అమలవుతుంది.
18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరూ ఈ పథకానికి అర్హులే.
రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే 10 రోజుల్లో పాలసీ క్లెయిమ్ అవుతుంది.
ఆగస్టు 15లోపు సంబంధిత పత్రాలన్నీ నింపి ఎల్‌ఐసీకి అందజేయాలి.
రైతుల బీమా పత్రాలను వ్యవసాయ అధికారులు మాత్రమే పూర్తిచేయాల్సిఉంటుంది.
నామినీ వివరాలను రైతులు చెప్పిన ప్రకారమే నింపాలి.
ఇందుకోసం ఏవోలకు ఐప్యాడ్‌లు అందజేస్తామని, రైతులందరి పేర్లు అందులో నమోదై ఉండాలని సీఎం చెప్పారు.

రైతుబంధు వదులుకున్నా.. రైతుబీమా మాత్రం తీసుకుంటా: ‘‘బాగా సంపాదించే రైతులు రైతుబంధు పథకం కింద వచ్చే డబ్బును తీసుకోవద్దని ముఖ్యమంత్రిగా నేను కోరాను. ఆ మేరకు నాతోపాటు చాలా మంది చెక్కులు తీసుకోలేదు. అయితే ఇప్పటి రైతుబీమా పథకంలో మాత్రం నా పేరు కూడా నమోదు చేయించుకుంటా’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతుబీమా పథకానికి సంబంధించి తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఎల్‌ఐసీకి గర్వకారణమని ఆ సంస్థ చైర్మన్‌ వీకే శర్మ అన్నారు.

మరిన్ని వార్తలు