పంటల బీమాకు కంపెనీల తూట్లు

24 Jul, 2018 02:05 IST|Sakshi

గడువు గండంతో బీమా పరిధిలోకి రాని లక్షలాది పత్తి రైతులు

ఇప్పటివరకు 2 లక్షల మంది రైతుల ప్రీమియాన్నే సేకరించిన వైనం

బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో ప్రీమియానికి అడ్డంకులు

సాక్షి, హైదరాబాద్‌: రైతులను పంటల బీమా పరిధిలోకి తీసుకురావడంలో బీమా కంపెనీలు విఫలం అవుతున్నాయి. ఇప్పటివరకు 50 లక్షల ఎకరాలకు పైనే ఖరీఫ్‌ పంటలు సాగైతే కనీసం ఐదు లక్షల ఎకరాల రైతులను కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద పత్తి పంట వస్తుంది. రాష్ట్రంలో 40 శాతం పైగా ఇదే సాగవుతోంది. ఇప్పటికే 37 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అటువంటి పత్తికి పంటల బీమా ప్రీమియం గడువు ఈ నెల 15తో ముగిసింది.

కానీ పత్తి బీమా ప్రీమియం చెల్లించని రైతులు లక్షలాది మంది ఉన్నారు. దాదాపు 15 లక్షల మందికి పైగా రైతులు పత్తి సాగు చేస్తే, లక్షన్నర మందిని కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలున్నాయి. అన్ని పంటలకు కలిపి ఇప్పటివరకు కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ప్రీమియం చెల్లించినట్లు సమాచారం. పైగా ఈ నెలలో వరుసగా 14, 15వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

ఈ విషయంలో ముందే మేల్కొనాల్సిన వ్యవసాయశాఖ గడువు ముగిసిన తరువాత బీమా కంపెనీలకు రెండు రోజులు పెంచాలని కోరింది. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎస్‌బీఐ, జాతీయ వ్యవసాయ బీమా కంపెనీలు ఈ నెల 17 వరకు పెంచేందుకు అంగీకరించాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ రాసిన లేఖకు ఏఐసీ సుముఖత వ్యక్తం చేసినా మిగతా రెండు కంపెనీలు గడువు పెంచేందుకు ససేమిరా అన్నాయి. ఇలా బీమా కంపెనీలు రైతుతో ఆడుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.  

బ్యాంకుల సహకారం సున్నా...
మన రాష్ట్రంలో మొత్తం ఆరు క్లస్టర్లుగా పంటల బీమా అమలు చేస్తున్నారు. ఇందులో ఈ వానాకాలం బీమాను రెండు క్లస్టర్లను వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) అమలు చేస్తుండగా, ఎన్‌ఐసీ మూడు, టాటా ఒక క్లస్టర్‌లో అమలు చేస్తున్నాయి. ఏఐసీ పత్తికి రెండ్రోజుల పొడిగింపునకు అంగీకరించినప్పటికీ ఆ పరిధిలోని రైతులకు తెలియజేయడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందింది.

ఫలితంగా ఆ క్లస్టర్‌ పరిధిలో 10 జిల్లాల్లోని రైతులు నష్టపోయారుఇటు బ్యాంకులపై ఒత్తిడి పెంచి రుణాలు ఇప్పించడంలోనూ అలసత్వం ప్రదర్శించగా, రుణం తీసుకోని రైతులను ప్రీమియం కట్టేలా అవగాహన కూడా కల్పించలేకపోయారు. వాస్తవంగా ఖరీఫ్‌లో పంట రుణాలు రూ.25 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు బ్యాంకులు రూ.6 వేల కోట్లలోపే ఇచ్చాయి.

వాస్తవంగా ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణంలో ఇప్పటివరకు సగంపైనే సాగైతే, రుణాలు మాత్రం నాలుగో వంతు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో బ్యాంకు రుణాల ద్వారా పంటల బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా జూన్‌లోపే రుణాలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇప్పటివరకు రైతులను సతాయిస్తున్నాయి. అటు బీమా కంపెనీలు, ఇటు బ్యాంకులు రైతులను బీమా పరిధిలోకి తీసుకు రానీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయి.  

50 శాతం బీమా లక్ష్యానికి సమస్యలు..
మన రాష్ట్రంలో సాగయ్యే భూమిలో బీమా పరిధిలోకి వచ్చే భూమి కేవలం 20 శాతం వరకే ఉంటుంది. ఒక్కోసారి అది 15 శాతానికే పరిమితమవుతోంది. అయితే కేంద్రం ఈ ఏడాది బీమా పరిధిలోకి 50 శాతం భూమిని తీసుకురావాలన్న నిబంధన పెట్టింది. కానీ అది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మన రాష్ట్రంలో 2016లో వానాకాలం, యాసంగిలతో కలిపి 1.39 కోట్ల ఎకరాలు సాగు కాగా, కేవలం 20.95 లక్షలు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చింది.

అంటే సాగులో 15 శాతమే. అలాగే 2017లో వానాకాలం, యాసంగిలతో కలిపి మొత్తం 1.41 కోట్ల ఎకరాలలో సాగు కాగా 30 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకి వచ్చింది. అంటే 21 శాతం. ఈసారి అంత మొత్తంలో రావడం కష్టమేనని అధికారులే పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ ఏడాది 50 శాతమైనా బీమా పరిధిలోకి తీసుకు రావాలన్న లక్ష్యం నీరుగారే ప్రమాదముంది.

పరిహారం చెల్లింపుల్లో నిబంధనలు పక్కాగా పాటించని బీమా కంపెనీలు, గడువు తేదీల విషయంలో మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే పత్తి పంటకు గులాబీ పురుగు సోకితే పరిహారం రావడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా