ఆసరా అనుసంధానం అరకొర!

29 Jun, 2015 03:39 IST|Sakshi
ఆసరా అనుసంధానం అరకొర!

సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా.. పింఛను సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలనే ప్రభుత్వం భావించింది. కానీ, బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల అనుసంధాన ప్రక్రియ నాలుగు నెలలుగా నత్తనడకన సాగడంతో అది నెరవేరడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32,20,156 మంది పెన్షనర్లలో కేవలం 16,18,517 (సగం మంది) ఖాతాలకే పింఛన్ల సొమ్ము జమవుతోంది.

అలాగే భృతిని పొందుతున్న 3.20 లక్షల బీడీ కార్మికుల్లో ఖాతాల ద్వారా పింఛను పొందుతోంది 1.75 లక్షల మందికే. మిగిలిన బీడీ కార్మికులకు, పెన్షనర్లకు పింఛను సొమ్మును సిబ్బంది ద్వారా అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా, లబ్ధిదారులకు సంపూర్ణంగా అందడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే కొందరు దళారులు వృద్ధులు, వికలాంగుల పింఛను సొమ్ము స్వాహా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
 
ససేమిరా అంటున్న బ్యాంకర్లు
పింఛను సొమ్ము లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వృద్ధులు, వికలాంగులకు ఖాతాలు తెరిచేందుకు కొన్ని బ్యాంకులు విముఖత వ్యక్తం చేస్తున్నాయని సెర్ప్ అధికారులు వాపోతున్నారు. వృద్ధాప్య పింఛను పొందుతున ్న వారంతా 65 ఏళ్లు పైబడిన వారు కావడం, వికలాంగుల్లో కొందరి వేలిముద్రలు సరిగా ఉండకపోతుండడాన్ని బ్యాంకులు కారణాలుగా చూపుతున్నాయి. జీరో బ్యాలెన్స్ ఖాతాల వల్ల బ్యాంకుకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోవడం, కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు బ్యాంకులు అందుబాటులో లేకపోవడం కూడా ఖాతాల అనుసంధానానికి ఆటంకంగా మారింది.

గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛను పంపిణీ చేసేందుకు సెర్ప్ అధికారులు ప్రయత్నించినా, పోస్టాఫీసుల నుంచి సహకారం లభించడం లేదు. కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని లబ్ధిదారులకు పింఛను సొమ్మును పంపిణీ చేసేందుకు పోస్టాఫీసు అధికారులు మొగ్గు చూపడం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండలలో పెన్షనర్ల బ్యాంకు ఖాతాలను నేటికీ అనుసంధానం చేయలేదు. పింఛనర్లు బ్యాంకు ఖాతాలు తెరిచేలా బ్యాంకర్లను ఒప్పించాలని జిల్లా స్థాయిలో కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు.

>
మరిన్ని వార్తలు