నొప్పి మటాష్‌

15 Oct, 2019 12:05 IST|Sakshi

అందుబాటులోకి ఆయుర్వేద, ప్రకృతి వైద్యం

ఆరోగ్య సమస్యలకు పంచకర్మ చికిత్సలు  

నిమ్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌  

జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో నగరవాసులు వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. వీటిని పెద్ద సమస్యలుగా భావించి చాలామంది కార్పొరేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ తక్కువ ఖర్చులోనే సహజ సిద్ధమైన వైద్య చికిత్సలతో నొప్పులకుఉపశమనం కల్పిస్తోంది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ఆయూష్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిమ్స్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌వెల్‌నెస్‌ సెంటర్‌.   

సాక్షి, సిటీబ్యూరో: తలనొప్పి, కండరాల, మోకీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, విటమిన్స్‌ లోపం, అధిక బరువు వంటి సాధారణ సమస్యలను కూడా చాలా మంది చాలా పెద్ద జబ్బులుగా భావిస్తుంటారు. చిన్నచిన్న చిట్కాలు, సహజ పద్ధతులతో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు కానీ చాలా మంది ఈ చికిత్సల కోసం కార్పొరేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. రకరకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, మందుల పేరుతో భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వచ్చిన నొప్పి కన్నా వైద్య చికిత్సల పేరుతో చేసిన ఖర్చు గుర్తొచ్చి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. సాధారణ నొప్పులతో పాటు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తక్కువ ఖర్చుకే సహజమైన పద్ధతిలో మెరుగైన సేవలు అందించేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆయూష్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(నిమ్స్‌)లో ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్స్‌ పేరుతో యో గ, ఆయుర్వేద, ప్రకృతి వైద్య సేవలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌(జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు) లబ్ధిదారుల కోసం ఖైరతాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లో ఈ సేవలను అందిస్తున్న ఆయుష్‌ విభాగం తాజాగా నిమ్స్‌కు వచ్చే వీఐ పీలు సహా సాధారణ రోగులకు ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ సేవలను అందిస్తుంది. 

ఒక్కో చికిత్సకు..ఒక్కో ప్యాకేజీ  
పంచకర్మ చికిత్సల్లో భాగంగా  స్నేహకర్మ, నదిస్వేదం, పిండిస్వేదం, కతివస్తి, జనువస్తి, నాశ్యకర్మ, శిరోధార, డెటాక్స్‌ థెరపీ, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నిర్మూలన, బాడీ మసాజ్, మైగ్రేన్, వంటి సేవలతో పాటు పకృతి వైద్య సేవలల్లో భాగంగా జనరల్‌ మసాజ్, స్ట్రీమ్‌బాత్, డైట్‌కౌన్సిలింగ్, కోల్డ్‌ బ్లాంకెట్‌ ప్యాక్, తల, కండరాలు, నడుం, భుజాలు, మోకీళ్ల నొప్పులకు చికిత్సలు అందిస్తుంది. ఆక్యుపంక్చర్, యోగ వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచింది. రోగులు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చికిత్సను అందిస్తుంది.ఎంపిక చేసుకున్న చికిత్స, సేవలు, సిట్టింగ్‌ ఆధారంగా (రూ.150 నుంచి రూ.750 వర కు)చార్జీలు వసూలు చేస్తుంది.  అయితే బాధితులు ముందే స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకస్లాట్‌గా, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు మరో స్లాట్‌గా నిర్ణయించారు.

దీర్ఘకాలిక జబ్బులు రాకుండా ఉండాలనే..
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం నగరంలో చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. విటమిన్లలోపం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతుంటే, పోషకాహార లోపం వల్ల మరికొంత మంది అనారోగ్యం పాలవుతున్నారు. నొప్పులకు, జబ్బులకు ముందే కారణం గుర్తించగలిగితే చాలా తక్కువ ఖర్చుతో చిన్నపాటి చిట్కాలతోనే వాటి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. జబ్బు ముదురిన తర్వాత వచ్చే కంటే ముందే ఈ చికిత్సలను చేయించుకోవడం వల్ల నొప్పుల భారీ నుంచే కాదు ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ప్రకృతి వైద్యంపై అవగాహన కల్పించి, భవిష్యత్తులో వారు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా చూసేందుకే ఇక్కడ ఏర్పాటు చేశాం.  ఆయుర్వేద, ప్రకృతి వైద్య సేవలు, స్లాట్‌ బుకింగ్‌ కోసం 040–23489023, 9652292825, 9440974984  నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.    –  ఎం.డాక్టర్‌ నాగలక్ష్మి,    ఇంచార్జి, ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌సెంటర్, నిమ్స్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా