నకిలీ పట్టేస్తా!

26 Nov, 2019 01:21 IST|Sakshi

‘బ్లాక్‌చెయిన్‌’తో జేఎన్టీయూ సర్టిఫికెట్లు అనుసంధానం

ఎస్సెస్సీ, బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రయోగాత్మక పరిశీలన

విద్యుత్‌ రంగంలో పారదర్శకత పెంచేందుకు ‘పీ2పీ’

భవిష్యత్తులో రవాణా, ఔషధ రంగాల్లోనూ అమలు

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత చదువు, ఉద్యోగాల కోసం మన దేశం నుంచి ఏటా లక్షల మంది అమెరికాకు బారులు తీరుతున్నారు. అక్కడి కాలేజీల్లో ప్రవేశాలు, సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న కొందరు విద్యార్థులు, యువత నకిలీ సర్టిఫికెట్లను జత చేస్తున్నారు. దరఖాస్తుల వివరాలపై లోతుగా ఆరా తీసే క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూస్తుండటంతో, ఈ అంశంపై దృష్టి సారించాలని అమెరికా రాయబార కార్యాలయం భారత్‌కు సూచించింది. పైగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఏపీల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో, నకిలీ సర్టిఫికెట్ల బెడద నివారించేందుకు తెలంగాణ ఐటీ శాఖ నడుం బిగించింది.

నకిలీ సర్టిఫికెట్ల నివారణకు ‘బ్లాక్‌చెయిన్‌’సాంకేతికత పరిష్కారమని ఐటీ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డుతో పాటు, బాసర ట్రిపుల్‌ ఐటీలోనూ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఐటీ శాఖ.. హైదరాబాద్‌ జేఎన్టీయూ ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్ల వివరాలను కూడా త్వరలో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో అనుసంధానించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ జేఎన్టీయూ వీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో జేఎన్టీయూను ఎంపిక చేసినట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ‘బ్లాక్‌చెయిన్‌’సాంకేతికత ఆచరణలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్‌ ఇటీవలే ప్రకటించింది.

ఇతర రంగాలకూ విస్తరణ 
నకిలీ సర్టిఫికెట్లను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అమెరికా రాయబార కార్యాలయంతో పాటు, ఇతర నియామక కంపెనీల వద్ద కూడా లేదు. నకిలీల బెడద ఎదుర్కోవడంలో బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత సమర్థంగా ఉపయోగపడుతుందని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ వినియోగంలో భారత్‌ ముందంజలో ఉన్నట్లు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబల్‌ బ్లాక్‌చెయిన్‌ స్టాండర్డ్స్‌ కాన్ఫరెన్స్‌’వెల్లడించింది. దేశంలో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తేవడంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్ల బెడదను నివారించడమే కాకుండా ఇతర రంగాల్లోనూ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ వినియోగాన్ని విస్తరించాలని ఐటీ శాఖ నిర్ణయించింది.

విద్యుత్‌ శాఖ లావాదేవీల్లో పారదర్శకత, సామర్థ్యం పెంచడంతో పాటు, వినియోగదారులపై విద్యుత్‌ చార్జీల భారం తగ్గించడం లక్ష్యంగా ‘బ్లాక్‌చెయిన్‌’ను వేదికగా చేసుకుని పీ2పీ (పీర్‌ టు పీర్‌) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. పీ2పీ బ్లాక్‌చెయిన్‌ వేదికను రూపొందించేందుకు అహ్మదాబాద్‌ ఐఐఎంతో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాల జీవిత కాలానికి సంబంధించిన సమాచారం (వెహికల్‌ లైఫ్‌టైమ్‌ మేనేజ్‌మెంట్‌), ఔషధాల్లో నకిలీల నివారణలోనూ ఈ టెక్నాలజీని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

బ్లాక్‌చెయిన్‌ అంటే.. 
ఇంటర్నెట్‌ రంగానికి ఇటీవల వెన్నెముకగా మారుతున్న నూతన ఐటీ సాంకేతికత పేరు ‘బ్లాక్‌చెయిన్‌’. ఈ నూతన సాంకేతికత ద్వారా డిజిటల్‌ సమాచారాన్ని పంపిణీ చేయొచ్చు కానీ కాపీ చేయలేం. ఒక సంస్థ తన సమాచారాన్ని ఇంటర్నెట్‌ వినియోగదారులకు అందుబాటులో పెడుతుంది. కానీ ఆ సంస్థ అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని తస్కరించడం లేదా కాపీ చేయడానికి అవకాశం లేకుండా, డేటా నిర్వహణ పూర్తిగా సదరు సంస్థ అధీనంలోనే ఉంటుంది.

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫారంలోని భాగస్వామి ఏదైనా సమాచారాన్ని కోరితే.. ఆ సమాచారాన్ని కలిగి ఉన్న భాగస్వామి తన డేటా బేస్‌ను పరిశీలించి సమాధానం ఇవ్వొచ్చు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీకి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ఏదైనా కొత్త సాంకేతికతకు ఉన్నట్లే బ్లాక్‌చెయిన్‌కు కూడా కొన్ని అవరోధాలు ఉన్నాయని, అయితే రాబోయే రోజుల్లో వాటిని అధిగమిస్తామని ఐటీ శాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు