కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

5 Aug, 2014 02:17 IST|Sakshi
కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

రాంనగర్  :తెలంగాణ పునర్నిర్మాణంలో తొలి అడుగుకు ఉపయోగపడే సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. సమగ్ర కుటుంబ సర్వేపై సోమవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో మండల, పట్టణస్థాయి రిసోర్సు పర్సన్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం ఒకే రోజు జరపడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారుల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వే కీలకం కానుందన్నారు. ఎంత వ్యయ ప్రయాసల కోర్చి అయినా ఒక్క రోజే సర్వే పూర్తి చేసి డేటా ఎంట్రీ నిర్వహించి సర్వే ఫారాలను ఆర్‌డీఓలకు అందజేయాలన్నారు.
 
 జిల్లాలో 9 లక్షలకు పైగా కుటుంబాలుంటే 10 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయని, మరో 4 లక్షల మంది రేషన్‌కార్డులు కొత్తగా కావాలని కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న  నిధులన్నీ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేవని గ్రహించాలన్నారు. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేవిధంగా ఈ సర్వే దోహదపడుతుందని చెప్పారు. పింఛన్లు, గృహ నిర్మాణాలు, రేషన్‌కార్డులు, ఇతర లబ్ధి మొత్తం ఈ సర్వే డేటా ఆధారంగానే ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. గతంలో చాలా రకాల సర్వేలు చేసినా ఈ సర్వేకు చాలా తేడా ఉన్నట్లు తెలిపారు. అవినీతి, అక్రమాలు చోటు చేసుకోకుండా సర్వే ద్వారా పథకాలను కట్టుదిట్టంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. గృహాల సర్వే విషయంలో వయస్సు నిర్ధారణ కోసం రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు పరిశీలించాలని అధికారులకు సూచించారు.
 
 సమాచార సేకరణ అనేది ఒక కళ అని, సమాచార సేకరణలో వృత్తి నైపుణ్యం ప్రదర్శించి సమగ్ర సమాచారం సేకరించాలని కోరారు. సర్వే కోసం ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఎక్కువ నివాసాలు ఉన్న బ్లాకులకు సహాయ నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ఇద్దరు సహాయకులతో వెళ్లి నివాసాలకు నోటిఫైడ్ నంబరు కేటాయించి జాబితాలను ఎన్యుమరేటర్లకు అందజేయాలని సూచిం చారు.  ఒక్కో ఎన్యుమరేటర్‌కు 30 ఇళ్లు కేటాయిస్తామని, 9 లక్షల కుటుంబాలకు గాను 32 వేల మంది సిబ్బంది నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే మరో 5 శాతం అదనపు సిబ్బంది సేవలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీపీఓ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌రావు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు