‘పంచాయతీ’కి ముమ్మర కసరత్తు

1 May, 2018 01:13 IST|Sakshi

అన్ని గ్రామాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల నిమిత్తం ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకారం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ముసాయిదా ఓటర్ల జాబితా పెట్టారు. పంచాయతీ కార్యాలయంతోపాటు మరో రెండు ముఖ్యకేంద్రాల్లో జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను రూపొందించారు. ముసాయిదా జాబితాపై వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ మంగళవారం నుంచి మొదలవుతోంది.

మే 8 వరకు వీటికి అవకాశముంటుంది. అభ్యంతరాలను, ఫిర్యాదులను మే 10లోపు పరిష్కరిస్తారు. అనంతరం అన్ని అంశాలను సరిచూసుకుని తుది ఓటర్ల జాబితాను రూపొందించి 17న అన్ని పంచాయతీల్లో ప్రకటిస్తారు. అనంతరం బీసీ ఓటర్ల గణన ప్రక్రియ మొదలవుతుంది. మే 18 నుంచి బీసీ ఓటర్ల గణన జరిగే అవకాశం ఉందని పంచాయతీరాజ్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రామపంచాయతీల ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది.

కొత్త పంచాయతీల ప్రకారం గడువులోపు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్ని కల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు నమోదై ఉంటారు. బీసీ ఓటర్లను మాత్రం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి బీసీ ఓటర్లను గుర్తించనున్నారు. బీసీ ఓటర్ల గుర్తింపు అనంతరం ఎన్నికల నిర్వహణ తేదీలపై స్పష్టత వస్తుంది. పంచాయతీల్లో వార్డుకో పోలింగ్‌ కేంద్రాన్ని ఏ ర్పాటు చేస్తారు. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,741కు పెరిగింది. 1,13,380 వార్డులున్నాయి. 

>
మరిన్ని వార్తలు