నారాయణ, శ్రీచైతన్య హాస్టళ్లు నరకానికి నకళ్లు

6 Nov, 2017 02:56 IST|Sakshi

విద్యార్థులను నిద్రపోనివ్వరు.. మంచి భోజనం పెట్టరు

అన్ని చోట్ల ఇదే పరిస్థితి..  ఇంటర్‌ బోర్డు నోటీసుల జారీ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు చెందిన హాస్టళ్లలో విద్యార్థులకు నరకం కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కంటి నిండా నిద్ర.. కడుపు నిండా తిండి లేదు. కాలేజీలు, హాస్టళ్లలో సమయ పాలన లేదు.. ఆటలు లేవు.. కనీసం సెలవు దినాల్లోనూ విరామం ఇవ్వడం లేదని రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రత్యేక బృందాలు జరిపిన తనిఖీల్లో బయటపడింది. వారం రోజులపాటు నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 146 హాస్టళ్లలో బోర్డు అధికారుల బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయగా.. ఈ లోపాలు బయటపడినట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. అనుబంధ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఆయా కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 15 రోజుల సమయం ఇచ్చామని, సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. బోర్డు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేట్‌ కాలేజీల వ్యవహారం, విద్యార్థుల పరిస్థితి, తాము చేపడుతున్న చర్యలను వివరించారు. వివరాలు అశోక్‌ మాటల్లోనే.. 

బోర్డు చట్టంలోనూ మార్పులు! 
కాలేజీలు, హాస్టళ్లపై నియంత్రణకు బోర్డు చట్టంలోనూ మార్పులు తీసుకువస్తాం. హాస్టళ్లను బోర్డు పరిధిలోకి తెస్తాం. పీఆర్‌వోల వ్యవస్థను పెట్టుకొని తల్లిదండ్రులను ఆకర్షించి విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఇందుకు ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తున్నాయి. మంచి ర్యాంకులు వచ్చాయంటూ ప్రకటనలతో కాలేజీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దీన్ని నిషేధించేందుకు చర్యలు చేపడతాం. సమగ్ర పరిశీలన జరిపి సిఫారసులు చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో బోర్డు కార్యదర్శితోపాటు అధికారులు, తల్లిదండ్రులు, న్యాయ నిపుణులు, యాజమాన్యాల ప్రతినిధులు ఉంటారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం కమిటీ సభ్యుల పేర్లను త్వరలో ఖరారు చేస్తాం. 

రెసిడెన్షియల్‌ కాలేజీగానే ‘గుర్తింపు’ 
ఇకపై కాలేజీ పేరుతో అనుబంధ గుర్తింపు ఇవ్వం. హాస్టళ్లు ఉన్న వాటికి రెసిడెన్షియల్‌ కాలేజీ పేరుతోనే గుర్తింపు ఇస్తాం. నిబంధనల ప్రకారం ఉంటేనే హాస్టళ్లు నడిపేందుకు అనుమతి. హాస్టళ్ల నియంత్రణకు ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటితోపాటు కొత్త నిబంధనలను అందుబాటులోకి తెస్తాం. అలాగే ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో యాజమాన్యాలు చేస్తున్న అడ్డగోలు ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతాం. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేస్తాం. కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. తర్వాత జూనియర్‌ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు విధానం రూపొందిస్తాం. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

ఫిర్యాదులకు త్వరలోనే కాల్‌సెంటర్‌ 
ప్రైవేటు కాలేజీల ఆగడాలు, ఫీజులు, ఇతర సమస్యలకు సంబంధించి వారం రోజుల్లో బోర్డు కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. కార్పొరేట్‌ కాలేజీల ఆగడాలను నియంత్రించేందుకు, వాటి అవకతవకలపై అనేక చర్యలు చేపట్టాం. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 29 కాలేజీలకు నోటీసులు ఇవ్వడమే కాకుండా రూ.1.66 కోట్లు వసూలు చేశాం. విజిలెన్స్‌ రిపోర్టు ప్రకారం చర్యలు చేపట్టాకే అనుబంధ గుర్తింపునకు అవకాశం కల్పించాం. 

ఫిబ్రవరిలో అనుబంధ గుర్తింపు ప్రక్రియ 
2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించిన అనుబంధ గుర్తింపు ప్రక్రియను వచ్చే ఫిబ్రవరిలోనే చేపడతాం. మార్చిలో పూర్తి చేసి, మార్చి 31వ తేదీలోగా గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, గుర్తింపు లభించని కాలేజీల జాబితా ప్రకటిస్తాం. గుర్తింపు లేని వాటిలో చేరవద్దు. ఇప్పుడు ఎవరు ప్రవేశాలు చేపట్టినా చెల్లవు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. 

146 హాస్టళ్లు ఆ రెండింటివే! 
ఇంటర్‌ బోర్డు బృందాలు తనిఖీలు చేసిన 146 కాలేజీల హాస్టళ్లు నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలవే. రంగారెడ్డిలో 35, మేడ్చల్‌లో 51, హైదరాబాద్‌లో 60 కాలేజీల హాస్టళ్లలో తనిఖీలు జరిపారు. వాటిలో అకడమిక్‌ కేలెండర్‌ అమలు చేయడం లేదు. ఉదయం 10.00 నుంచి సాయంత్రం 4 వరకే బోధన చేపట్టాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ఉదయం 6.00 నుంచి రాత్రి 8.00 వరకు చదువే చదువు. భోజనంలో నాణ్యత లేదు. పోనీ క్యాంటిన్‌లో తిందామంటే విద్యార్థుల నుంచి 3 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. వాష్‌రూమ్‌లు, టాయిలెట్లు సరిగ్గా, సరిపడా లేవు. నలుగురి నుంచి ఆరుగురు ఉండాల్సిన గదుల్లో 8 నుంచి 12 మందిని ఉంచుతున్నారు.

విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సెలర్లను నియమించలేదు. ఆదివారాల్లోనూ విద్యార్థులను తల్లిదండ్రులతో కలవనీయడం లేదు. దీనిపై విద్యార్థులతో మాట్లాడాం. ఆధారాలు సేకరించాం. నోటీసులకు యాజమన్యాల సమాధానాలు వచ్చాక అవి సంతృప్తికరంగా లేకుంటే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడేది లేదు. విద్యార్థుల ఆత్మహత్యలు జరిగిన అన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చాం. ఎక్కువ సంఖ్యలో కాలేజీలు ఉండి, హాస్టల్‌ సదుపాయాలు ఉన్న యాజమన్యాలు మరో 18 వరకు ఉన్నాయి. వాటిలోనూ త్వరలో తనిఖీలు చేస్తాం. 

7న డిప్యూటీ సీఎం భేటీ 
కాలేజీల్లో లోపాలను సవరిం చుకోవాలని, నిబంధనలను పాటించాలని చెప్పేందుకు, ఇతర సమస్యలపై చర్చించేందుకు యాజమాన్యాలతో ఈనెల 7న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశం కానున్నారు. సచివాలయంలో సాయం త్రం 4 గంటలకు జరిగే సమావేశానికి 20 యాజమాన్యాలు, అనుబంధ హాస్టళ్లు ఉన్న కాలేజీలకు చెం దిన కరస్పాండెంట్లు, యజమానులు హాజరుకానున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా