ఫస్ట్‌ ఇయర్‌లో టాప్‌ సెకండ్‌ ఇయర్‌లో ఫెయిల్‌

21 Apr, 2019 01:27 IST|Sakshi

తెలుగులో జీరోమార్కులతో విద్యార్థినికి నష్టం

ఇంటర్‌బోర్డు నిర్వాకంతో ఆవేదన 

న్యాయం చేయాలంటున్న తల్లిదండ్రులు

జన్నారం: ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సీఈసీ గ్రూపులో 500 మార్కులకు గాను 467 మార్కులు సాధించిన విద్యార్థిని ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో తెలుగులో జీరోమార్కులు రావడం చూసి అవాక్కయింది. ఇంటర్‌ బోర్డు నిర్వాకం కారణంగా విద్యార్థిని తీవ్రంగా నష్టపోయినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన సత్తన్న, కవితల కూతురు నవ్య మండల కేంద్రంలోని కరిమల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సీఈసీ చదివింది. మొదటి సంవత్సరంలో 467 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో కూడ జిల్లా టాపర్‌గా నిలువాలనుకున్నది. కష్టపడి చదివింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాలను చూసి అవాక్కయింది. మిగతా సబ్జెక్టులలో 90కి పైగా మార్కులు వచ్చి తెలుగులో సున్నా మార్కులు రావడంతో విద్యార్థిని నోట మాటరాలేదు. కళాశాల యాజమాన్యం సైతం ఆశ్చర్యపోయింది. నవ్య కళాశాల టాపర్‌ అని, తెలుగులో జీరో మార్కులు రావడం ఏంటని యాజమాన్యం అంటోంది. ఈ విషయాన్ని డీఐవో కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో నవ్యకు తెలుగు సబ్జెక్టులో 98 మార్కులు రాగా ద్వితీయ సంవత్సరంలో జీరో మార్కులు రావడం జీర్ణించుకోలేకపోతోంది.  

టాపర్‌గా నిలవాలనుకున్నా: నవ్య, విద్యార్థిని
ఇంటర్‌లో కష్టపడి చదివా. టాపర్‌ కావాలనుకున్నాను. ప్రథమ సంవత్సరంలో జిల్లా టాపర్‌గా నిలిచాను. ద్వితీయ సంవత్సరంలో కూడ జిల్లా టాపర్‌గా రావలన్నది నా కల. కానీ బోర్డు నాకు అన్యాయం చేస్తుందని అనుకోలేదు. నాకు తెలుగులో తప్పకుండా 98 మార్కులు వస్తాయన్న ధీమాతో ఉన్నా. ఈ విషయంలో ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు నాకు న్యాయం చేయాలి.

ప్రభుత్వం న్యాయం చేయాలి: సత్తన్న, విద్యార్థిని తండ్రి
నా కూతురు నవ్య చదువులో ముందుండేది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో టాపర్‌గా ఉన్న ఆమెకు ఇప్పుడు ఫెయిల్‌ అయినట్లు మెమో రావడం బాధ అనిపించింది. నా బిడ్డ మానసికంగా కుంగిపోతోంది. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని నా బిడ్డకు న్యాయం చేయాలి.

‘ఇంటర్‌’పై బీజేపీ ఆందోళన యోచన
ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో గందరగోళం నెలకొన్న అంశంపై ఉద్యమించే దిశగా బీజేపీ సమాయత్తమవుతోంది. ఇంటర్‌ పరీక్షలో ఫెయిలై ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో, పరీక్షలు, ఫలితాలకు సాంకేతికతను అందించిన ఓ సంస్థ నిర్వాకం కారణంగా భారీఎత్తున తప్పిదాలు దొర్లినట్టు బీజేపీ పేర్కొంటోంది. ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థుల్లో కొందరు, ఈ తప్పిదాల బారిన పడినవారు ఉండే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి సమాధానం రానందున తొలుత ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఎదుట భారీ ధర్నాతో ఆందోళనను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఆదివారంలోగా ప్రభుత్వం స్పందించి చర్యలకు ఉపక్రమించని పక్షంలో ఇంటర్‌ బోర్డు ఎదుట ధర్నా చేయనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు.  

రూ.కోటి ఎక్స్‌గ్రేషియాకు డిమాండ్‌
ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం పొంది కుటుంబానికి అండగా నిలవాల్సిన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడి ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చినందున.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి మేర ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేయాలని నిర్ణయించింది. బోర్డు తప్పిదాల వల్ల విద్యార్థుల కుటుంబాల్లో కల్లోలం నెలకొందని, ‘విద్యార్థులు మాస్‌ హిస్టీరియా బారిన పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు’అని బోర్డు ఉన్నతాధికారి మాట్లాడటం దారుణమని, ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని పట్టుబట్టబోతోంది. బోర్డు తప్పిదాల నేపథ్యంలో ఎలాంటి రుసుము లేకుండా జవాబు పత్రాలను చూపించాలని, పునర్మూల్యాంకనం కూడా ఉచితంగా జరపాలని డిమాండ్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు