గచ్చిబౌలిలోని టీమ్స్‌లో కేంద్ర బృందం పర్యటన

25 Apr, 2020 10:25 IST|Sakshi

కరోనా తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో కేంద్ర బృందాలు పర్యటన

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా ఉధృతి అధికంగా ఉన్న నగరాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర బృందం శనివారం హైదరాబాద్‌ చేరుకుంది. గచ్చిబౌలి ఆస్పత్రిలో సదుపాయాలను కేంద్ర బృందం పరిశీలించింది. మూడు రోజుల పాటు ఈ బృందం హైదరాబాద్‌లోనే ఉండనుంది. ఇవాళ సాయంత్రం 3.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో బృంద సభ్యులు భేటీ అవుతారు. ఆదివారం డీజీపీ కార్యాలయం, ఎల్లుండి (సోమవారం) జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించనున్నారు. అనంతరం మరోసారి సీఎస్‌తో ఈ కేంద్ర బృందం సమావేశం అవుతుంది.

కాగా దేశంలో అతి పెద్ద కరోనా హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో హైదరాబాద్‌ కూడా ఉంది. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉండటంతో ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందం నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనుంది. (విమానం ఎక్కాలంటే మాస్క్లు ఉండాల్సిందే)

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్‌ విలేజ్‌ కాంప్లెక్స్‌ భవనంలో కోవిడ్‌–19 అధునాతన ఆస్పత్రి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌(టిమ్స్‌) అందుబాటులోకి వచ్చింది. 1,500 బెడ్‌లతో కూడిన ఈ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్‌ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో 468 గదులు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. (గుడ్న్యూస్.. మరికొన్ని ఆంక్షలు సడలింపు)

ఇక కరోనా పాజిటివ్‌ కేసులు, అనుమానితుల సంఖ్య తగ్గడంతో నిన్న( శుక్రవారం) నగరంలోని పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ క్లస్టర్లను ఎత్తివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా కేసులు వెలుగులోకి రావడంతో ఆయా ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. (కాస్త ఊరట!)

మరిన్ని వార్తలు