జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు

8 May, 2020 01:33 IST|Sakshi

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

మొదలైన కోడింగ్‌.. 12 నుంచి మూల్యాంకనం

18న మోడర్న్‌ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు..

హైకోర్టు అనుమతిచ్చాక టెన్త్‌ పరీక్ష తేదీలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనంపై గురువారం అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సంబంధించి మొత్తంగా 53,10,543 జవాబు పత్రాల మూల్యాకనం చేయాల్సి ఉందని, అవన్నీ ఈనెల 30వ తేదీ వరకు పూర్తవుతాయన్నారు. జూన్‌ రెండో వారంలో ద్వితీయ సంవత్సర ఫలితాలను, మూడో వారంలో ప్రథమ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

మొదట ఇంటర్‌ ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనాన్నే చేపడతామన్నారు. లాక్‌డౌన్‌తో వాయిదా పడిన ఇంటర్మీడియట్‌ మోడర్న్‌ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ విద్యార్థులు 861 మంది ఉన్నారని, ఆ పరీక్షల నిర్వహణకు 17 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 12 స్పాట్‌ కేంద్రాలుండగా, భౌతిక దూరం పాటిస్తూ 33 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో రోజూ 600 నుంచి 700 మంది మూల్యాంకనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: భయం.. భయంగానే.. 

హైకోర్టు అనుమతించాక టెన్త్‌ పరీక్షలు 
కరోనా కారణంగా నిలిపేసిన పదో తరగతి పరీక్షలను హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలతో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి సబిత స్పష్టం చేశారు. ప్రస్తుతం 2,530 పదో తరగతి పరీక్ష కేంద్రాలను రెట్టిం పు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లకు మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు చేసే ఏర్పాట్లపై కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని, కోర్టు అనుమతివ్వగానే పరీక్ష తేదీలను ప్రకటిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిరోజూ కేం ద్రాల్లో కెమికల్‌ శానిటైజేషన్‌ చేస్తామన్నారు. బెంచ్‌కు ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టేలా చర్యలు చేపడతామన్నారు. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

స్కూళ్ల పునఃప్రారంభంపై లాక్‌డౌన్‌ తర్వాతే నిర్ణయం..
రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలనే అంశంపై లాక్‌డౌన్‌ తర్వాత నిర్ణయిస్తామని మంత్రి సబిత తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల నుంచి గతేడాది ఫీజులే వసూలు చేయాలని ఆదేశాలిచ్చామని, మానవత్వంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నెల వారీగా ఫీజులు తీసుకోవాలన్నారు. ఫీజులపై ఒకట్రెండు ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు చేపడతామన్నారు. ఇతర బోర్డులు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు పాటించాలని, ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   చదవండి: తెలంగాణలో కొత్త రూట్లో ప్రజా రవాణా! 

మరిన్ని వార్తలు