‘కాళేశ్వరం’పై మరోసారి అంతర్రాష్ట్ర చర్చలు

2 Aug, 2018 02:44 IST|Sakshi

3న హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర బోర్డు సమన్వయ కమిటీ భేటీ

రాష్ట్రానికి రానున్నమహారాష్ట్ర ఇంజనీర్లు, కలెక్టర్లు

వార్ధాపై బ్యారేజీ నిర్మాణంపై చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై మహారాష్ట్రతో మరోసారి అంతర్రాష్ట్ర చర్చలు జరగనున్నాయి. గతంలో మహారాష్ట్రలో జరిపిన ఒప్పందాల మేరకు జరుగుతున్న పనులు, ప్రస్తుత పరిస్థితులు, భూసేకరణ, అవసరమైన అనుమతులు, తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం తదితర అంశాలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ఇరు రాష్ట్రాల చీఫ్‌ ఇంజనీర్లు, కలెక్టర్లతో కూడిన ఈ కమిటీ ఈ నెల 3న హైదరాబాద్‌లో సమావేశమై ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్చలు జరపనుంది.

మహారాష్ట్రతో 2016 ఆగస్టులో కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణ ఒప్పందాల సందర్భంగా 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డలో నీటి నిల్వ, 148 మీటర్ల ఎత్తులో తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, మేడిగడ్డతో భూ అవసరాలు, వాటి సేకరణ, అనుమతులు, వరద నివారణ చర్యలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంటర్‌స్టేట్‌బోర్డు ఏర్పాటు చేసి అందులో చీఫ్‌ ఇంజనీర్ల స్థాయిలో సమన్వయ కమిటీ, సెక్రటరీల స్థాయిలో స్టాండింగ్‌ కమిటీ, ముఖ్యమంత్రుల స్థాయిలో బోర్డు ఏర్పాటు చేశారు.  

వార్ధాతో భూసేకరణ తగ్గే అవకాశం!
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రలో 453 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 40 ఎకరాల సేకరణ మాత్రమే మిగిలి ఉంది. దీనికి మహారాష్ట్ర సహకారం కోరాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీని 101 మీటర్ల లెవల్‌లో నిర్మించినా.. 100 మీటర్ల లెవల్‌లోనే నీటిని నిల్వ చేయాలని ఒప్పందం ఉంది. దీని నిర్మాణ పనుల తీరు, ఆమోదించిన డిజైన్స్‌పై మహారాష్ట్ర అడిగి తెలుసుకునే అవకాశముంది. తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలీ జిల్లాలోనే 509 ఎకరాలు ముంపు ఉండగా, ఆసిఫాబాద్‌ జిల్లాలో 300 ఎకరాల ముంపును అంచనా వేశారు.

తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతం రాష్ట్ర పరిధిలోని కవ్వాల్, మహారాష్ట్ర పరిధిలోని తడోబా వన్యప్రాణి ప్రాంతం పరిధిలో ఉంటోంది. దీంతో అటవీ అనుమతులతో పాటు వణ్యప్రాణి బోర్డు అనుమతులు తప్పనిసరి అయ్యాయి. అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా తమ ప్రాంత భూములు ఇచ్చేందుకు మహారాష్ట్ర సమ్మతి తెలపడంతో పర్యావరణ, అటవీ అనుమతులు దక్కాయి. ఈ అనుమతుల అంశంతో పాటు ప్రస్తుతం తమ్మిడిహెట్టికి బదులుగా వార్ధా నదిపై చేపట్టాలనుకుంటున్న బ్యారేజీ అంశాలను చర్చించాలని నిర్ణయించారు.

వార్ధా నదిపై బ్యారేజీ నిర్మాణం చేపడితే మహారాష్ట్రలో ఉండే ముంపు, భూసేకరణ, నీటి లభ్యత విషయంలో ఉన్న అనుమానాలపై తెలంగాణ ఇంజనీర్లు స్పష్టత ఇవ్వనున్నారు. తమ్మిడిహెట్టితో పోలిస్తే వార్ధా బ్యారేజీ నిర్మాణం చిన్నదైనందున భూసేకరణ చాలావరకు తగ్గే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ భేటీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఆదిలాబాద్‌ సీఈ భగవంతరావు, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, మహారాష్ట్ర తరఫున గడ్చిరోలీ, చంద్రాపూర్‌ జిల్లాల కలెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు