కొనసాగిన ‘ఇంటర్‌’ నిరసనలు

25 Apr, 2019 01:55 IST|Sakshi
డీవైఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు

బోర్డు ముందు విద్యార్థి సంఘాలు,తల్లిదండ్రుల ఆందోళన

డీవైఎఫ్‌ఐ కార్యకర్తల అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బోర్డు తప్పిదాలపై నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 6 రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఇంటర్‌ బోర్డును ముట్టడించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. బుధవారం కూడా పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టగా దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు పలికారు. జవాబు పత్రాల రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌కు విద్యార్థుల వద్ద ఫీజు వసూలు చేయొద్దని తల్లిదండ్రులు కోరారు. యంత్రాంగం చేసిన తప్పిదానికి తామెందుకు ఫీజు కట్టాలని ప్రశ్నించారు. ఫలితాల్లో తప్పిదాలు సవరించాలని, ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌ జరిపించాలని.. అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు వద్ద రోజురోజుకూ ఆందోళనలు తీవ్రతరమవుతుండడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్యార్థులను సైతం లోనికి అనుమతించడం లేదు. దీంతో ఇంటర్మీడియట్‌ ఫలితాలు, అడ్వాన్స్‌ సప్లిమెంటరీ, ఫీజు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్‌
ఇంటర్‌ బోర్డులో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ డీవైఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆరోపించింది. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే అధికారులు, మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించింది. బుధవారం బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో డీవైఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల చావుకు కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఆ పదవినుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. సరిగ్గా రాయనివారే ఫెయిల్‌ అవుతారని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు.

కమిటీ ముందుకొచ్చిన గ్లోబరీనా
ఇంటర్‌ ఫలితాలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిశీలన ప్రక్రియ వేగవంతమైంది. ఫలితాల విడుదలలో బోర్డు తీసుకున్న చర్యలతో పాటు సాంకేతిక వ్యవహారాలు చూసుకునే ప్రైవేటు సంస్థ ప్రమేయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈనెల 22న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 23న కమిటీ బృందం ఇంటర్‌బోర్డును సందర్శించి ఫలితాల ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉన్న వారితో చర్చించింది. ప్రస్తుత కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామ్‌ (సీఓఈ)తోపాటు అంతకు ముందున్న సీఓఈతో కూడా వేర్వేరుగా సమావేశమైంది. బుధవారం ఇంటర్‌ బోర్డులో డీపీఆర్పీ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనాతో సమావేశమైంది. ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఇచ్చిన సమాచారంతో పాటు కాంట్రాక్టు సంస్థ చేసిన కార్యక్రమాలను త్రిసభ్య కమిటీ విశ్లేషించనుంది.

>
మరిన్ని వార్తలు