మెట్రోతో మారుమూలల అనుసంధానం

26 Jun, 2018 01:40 IST|Sakshi
ఎలక్ట్రిక్‌ వాహనాలను పరిశీలిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో ఎన్వీఎస్‌ రెడ్డి, బొంతు రామ్మోహన్‌

రవాణా వ్యవస్థపై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు: కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని    మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. రవాణా మంత్రి పి.మహేందర్‌ రెడ్డితో కలసి సోమవారం ఇక్కడ మారుమూల ప్రాంతాలకు మెట్రో రైలు అనుసంధానంపై సమీక్షించారు. మెట్రో రైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు రవాణా శాఖ, ఆర్టీసీ, సెట్విన్, మెట్రో రైలు సంస్థలు సమన్వయంతో ముందుకు పోవాలని కోరారు.

శాఖల మధ్య సమన్వయం, నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రవాణా, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, మెట్రో రైలు ఎండీ, సెట్వీన్, జీహెచ్‌ఎంసీ, దక్షిణ మధ్య రైల్వే సంస్థల ప్రతినిధులను ఈ టాస్క్‌ఫోర్సులో సభ్యులుగా నియమించారు. నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఇందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఈ కమిటీని కోరారు. రెండు నెలల్లో ప్రాథమిక నివేదికతో ముందుకు రావాలని ఆదేశించారు.  నగరంలో రవాణా అవసరాలను తీర్చడంలో ఆర్టీసీ, మెట్రో రైలు సంస్థలు  పరస్పర సహకారంతో పనిచేస్తే మరింత మేలు చేకూరుతుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

నగరంలో ప్రయాణికుడే లక్ష్యంగా ప్రజా రవాణా సౌకర్యాలుంటాయని, ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్‌ నుంచి కార్యాలయాలను అనుసంధానం చేస్తూ రవాణా సదుపాయం కల్పించేందుకు దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. నగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ కోసం ఎలక్ట్రిక్‌ బస్సులు, వ్యాన్‌లు, ఆటోలనే తీసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు నగరంలోని మెట్రో స్టేషన్లు, బస్సు డిపోల వద్ద చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు.   

>
మరిన్ని వార్తలు