ఇది గ్లోబరీనా వైఫల్యమే

23 Apr, 2019 01:43 IST|Sakshi

ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్ల నుంచి ఫలితాల వరకు సంస్థ నిర్లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌ (డీపీఆర్పీ)లో తీవ్రమైన అవకతవకల కారణంగా ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గందరగోళంలో గ్లోబరీనా సంస్థదే ప్రధాన పాత్ర. ప్రాజెక్టు అమలు బాధ్యతలు తీసుకున్న మొదటిరోజు నుంచీ ప్రతిపనిలోనూ ఈ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీని కారణంగానే నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్‌ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. 

మొదట్లోనే చేతులెత్తేసినా..! 
డీపీఆర్పీ ప్రాజెక్టు టెండర్‌ దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ.. ఇంటర్‌ విద్యార్థుల అడ్మిషన్లు మొదలు పరీక్షాఫలితాలు ఇచ్చే వరకు నిర్దేíసిత కార్యక్రమాలన్నీ చాలా జాగ్రత్తగా చేపట్టాలి. 2018–19 విద్యాసంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన కొత్తలోనే గ్లోబరీనా గందరగోళానికి గురై చేతులెత్తేసింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి డేటా ప్రాసెస్‌ చేసింది. వారం రోజుల్లో దాదాపు 70వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడంతో ఆయా విద్యార్థుల వివరాలన్నీ కంప్యూటరీకరించింది. కానీ.. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ప్రాసెస్‌ చేసిన విద్యార్థుల డేటా మొత్తం కరప్ట్‌ అయ్యింది. ఆ తర్వాత మాన్యువల్‌ పద్ధతిలో కాలేజీల వారీగా వివరాలను ఆన్‌లైన్‌ చేయడంతో అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్రజాప్యం నెలకొంది.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇంటర్‌బోర్డు హడావిడిగా సీజీజీ (సెంటర్‌ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌)ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. డేటా ప్రాసెసింగ్‌లో అనుభవమున్న సీజీజీ.. ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసింది. ఈ ప్రక్రియ ఆలస్యమవడంతో 2018–19 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం కారణంగా.. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు చుక్కలు కనిపించాయి. అయితే.. సీజీజీ మొత్తం వివాదాన్ని క్లియర్‌ చేసిన ఇచ్చిన తర్వాత స్వల్ప మార్పులు, చేర్పులు చేసే పనిమాత్రమే గ్లోబరీనాకు మిగిలింది. అయితే ఈ దశలోనూ ఆ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. మళ్లీ డేటా కరప్షన్‌ కారణంగా విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులు డేటాలో మారిపోయాయి. దీంతో పరీక్షల సమయంలో.. విద్యార్థులకు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులున్న ఓఎంఆర్‌ షీట్లు జారీ అయ్యాయి. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్‌లు, ఇతర అధికారులు చొరవతీసుకుని.. సమీపంలోని పరీక్షా కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్‌ సెంటర్ల నుంచి ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు తెచ్చి సర్దుబాటు చేయడంతో విద్యార్థులు పరీక్ష రాశారు.
 
పరీక్ష ఫీజుల స్వీకరణలోనూ ఆగమాగం 
ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్ష ఫీజుల చెల్లింపు విషయంలోనూ భారీగా తప్పిదాలు జరిగాయి. ఫీజు స్వీకరణ తేదీని ప్రకటించిన నాటినుంచే చెల్లింపుల వెబ్‌సైట్‌ తెరుచుకోవాలి. కానీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యల కారణంగా.. నెలరోజులపాటు ఫీజు చెల్లింపు తేదీని పొడిగించాల్సిన దుస్థితికి గ్లోబరీనా వైఫల్యమే కారణం. క్షేత్రస్థాయిలో విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించగా.. వాటిని ఆన్‌లైన్లో జనరేట్‌ చేసి చలాన్లు చెల్లిస్తారు. ఫీజు ప్రాసెసింగ్‌లో భాగంగా ఈ సమాచారాన్ని ఫీజు చెల్లించిన, చెల్లించని విద్యార్థులను వేరు చేసి చూపేలా సాంకేతిక సహకారాన్ని గ్లోబరీనా అందించాలి. కానీ అందులోనూ దారుణ సాంకేతిక వైఫల్యం తలెత్తింది. ఈ సమస్యలను సరిదిద్దడంలో గ్లోబరీనా లోపాలు సుస్పష్టం కావడంతో పలుమార్లు ఫీజు గడువును పొడిగించాల్సి వచ్చింది. చివరగా ఫలితాల ప్రాసెసింగ్‌లోనూ భారీగా అవకతవకలు జరిగాయి. దీంతో మెరిట్‌ విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం, కొందరు ఫెయిల్‌ అవడంతో రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. డీపీఆర్పీ ప్రాజెక్టును చేపట్టిన గ్లోబరీనా అడుగడుగునా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి తప్పిదాలు చేయడమే విద్యార్థుల పాలిట శాపంగా మారింది. 

ఉద్యోగుల ఫిర్యాదు పైనా స్పందన కరువు 
డీపీఆర్పీ ప్రాజెక్టు అమల్లో.. కాంట్రాక్టు తీసుకున్న సంస్థ వ్యవహారశైలిపై మొదటినుంచీ ఇంటర్‌బోర్డు ఉద్యోగులు అసంతృప్తికరంగానే ఉన్నారు. కాంట్రాక్టు సంస్థకు సరైన అనుభవం లేకపోవడంతో బోర్డు తరపున చేయాల్సిన పనులను ఒకటికి రెండుసార్లు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఉద్యోగులకు చికాకు తెప్పింది. ఈ క్రమంలో కాంట్రాక్టు సంస్థ వ్యవహారశైలి, తప్పిదాలపై బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో భాగంగా చేయాల్సిన పనులు కాంట్రాక్టు సంస్థ సక్రమంగా చేయలేదని ఊహించిన కొందరు ఉద్యోగులు.. గతేడాది డిసెంబర్‌ చివరి వారంలో లిఖితపూర్వక ఫిర్యాదును ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శికి సమర్పించారు. ఈ ఫిర్యాదుతో గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో కొంతైనా మార్పు వస్తుందని ఆ ఉద్యోగులు భావించారు. కానీ కాంట్రాక్టు సంస్థకు బోర్డు నుంచి ఎలాంటి సూచన, హెచ్చరిక అందకపోవడంతో.. డీపీఆర్పీ ప్రాజెక్టు మరింత అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగులు సమర్పించిన ఫిర్యాదుతోనైనా స్పందించుంటే.. లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదని బోర్డు సిబ్బందొకరు వాపోయారు. 

పొరపాట్లు జరిగాయి.. సవరిస్తున్నాం
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. వాటిని సవరించే చర్యలు చేపట్టాం. జన్నారం మండలానికి చెందిన నవ్య జవాబు పత్రం వాల్యుయేషన్‌ ప్రక్రి యలో ఎగ్జామినర్, సూపర్‌వైజర్‌ తప్పిదాలున్నట్లు గుర్తించాం. విద్యార్థినికి వాస్తవ మార్కులు ఇచ్చాం. దీనిపై ఎగ్జామినర్, సూపర్‌వైజర్‌ల వివరణ కోరాం. తప్పులు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌ ప్రక్రియ పద్ధతి ప్రకారమే జరుగుతుంది. తేదీ పొడిగింపు అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.    
– అశోక్, ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి

మరిన్ని వార్తలు