వడ్డీ పడతలే..

8 Feb, 2018 18:30 IST|Sakshi

మూడేళ్లుగా వడ్డీ విడుదల చేయని ప్రభుత్వం

జిల్లావ్యాప్తంగా రూ.77.68 కోట్ల బకాయిలు

దిక్కుతోచని స్థితిలో మహిళా స్వయం సహాయక సంఘాలు

సాక్షి, సిద్దిపేట: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం.. పావలా వడ్డీకి రుణాలు అందిస్తే.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వడ్డీ లేకుండా రుణాలు అందిస్తామని ప్రకటించి మహిళలను సంతోషంలో ముంచేసింది. ఈ ప్రకటన మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతోంది. మూడు సంవత్సరాలుగా జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు వడ్డీ డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదు. తీసుకున్న రుణాలను వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెప్పడంతో మహిళలు ఆందోళన చెందుతున్నాయి. ఈక్రమంలో రుణ గడువు ముగిసే నా టికి వడ్డీ డబ్బులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. డబ్బులు విడుదల చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వడ్డీ కోసం ఎదురుచూపులు
మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోంది. ఒకవేళ మహిళలు ముందుగా చెల్లించే వడ్డీ డబ్బులను సైతం వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మహిళా సంఘాలు సంతోషడ్డాయి. అయితే, మూడేళ్లుగా అప్పునకు అసలు పోగా వడ్డీ డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో నని మహిళలు ఎదు రు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాల పరిధి లో 712 గ్రామైక్య సంఘాలు, 17,432 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఆయా సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు, వికలాంగులకు చెందిన సంఘాల్లో మొత్తం 1,88,990 మంది సభ్యులుగా ఉన్నారు.

వీరికి మూడేళ్లుగా రూ.77.68 కోట్ల వడ్డీ డబ్బులు రావాల్సి ఉందని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇందులో 2015–16 ఆర్థిక సంవత్సరానికి రూ.26.65 కోట్లు, 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.30.03 కోట్లు, 2017–18 సంవత్సరానికి రూ.21 కో ట్లు ఉన్నాయి. ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణం ఇస్తుందని.. అప్పులు తీసుకుంటే మూడు సంవత్సరాలుగా వడ్డీ రాకపోవడంతో అప్పు లు చేసి రుణం తీర్చామని మహిళలు చెబుతున్నారు. వడ్డీ డబ్బులు వస్తే పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు ఉపయోగించుకుంటామంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధు లు స్పందించి ప్రభుత్వం నుంచి వడ్డీ డబ్బులు త్వరగా విడుదల చేసేలా కృషి చేయాలని మహిళలు కోరుతున్నారు. 

త్వరలో విడుదలవుతాయి
మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి వడ్డీ ప్రభుత్వం ఇస్తుంది. జిల్లాలోని అన్ని సంఘాలకు సంబంధించిన వడ్డీ బకాయిలు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు వివరించాం. ప్రభుత్వం నుంచి వడ్డీ డబ్బులు త్వరలో విడుదలవుతాయి. నేరుగా బ్యాంకుల ద్వారా వారి అకౌంట్లలో జమ చేసేలా చర్యలు తీసుకుంటాం. 
– స్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

రూ.4 లక్షల అప్పు తీసుకున్నం..
మాది వర్షం మహిళా గ్రూపు. మా సంఘంలో సభ్యులంతా కలిసి బ్యాంకుల రూ.4 లక్షల అప్పు తీస్కున్నం. నెలనెలా క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లించాం. సక్రమంగా చెల్లించిన రుణాలకు వడ్డీ మాఫీ అన్నరు. మూడెండ్లవుతున్నా ఇప్పటి వరకు వడ్డీ మాఫీ అయినా పైసల్‌ మా ఖాతాల జమ కాలేదు. మాఫీ అయిన వడ్డీ రుణాలను ఎప్పుడిస్తరని ఐకేపీ సార్లను, బ్యాంకు సార్లను అడిగినా ఫలితం లేకుండే.
– ఎర్రోల్ల ఎల్లవ్వ, మహిళా గ్రూపు సభ్యురాలు, మిరుదొడ్డి

ఇప్పటి వరకు జమ కాలె..
బ్యాంకు రుణాలు ప్రతినెలా చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందంటే మా మహిళా గ్రూపు సభ్యులమంతా కలిసి బ్యాంకుల రూ.5 లక్షల రుణం తీసుకున్నం. బ్యాంకుల తీసుకున్న రుణాలకు నెలనెలా అప్పు చెల్లించినం. చెల్లించిన రుణాలకు వడ్డీ మాఫీ చేస్తమన్నరు. మాఫీ అయిన వడ్డీ మా ఖాతాల జమ అయితయన్నరు. ఇప్పటికి మూడెళ్లయితుంది. మాఫీ అయిన వడ్డీ పైసలు ఇప్పటి వరకు జమకాలే. 
– సునంద, మహిళా గ్రూపు సభ్యురాలు, లింగుపల్లి

>
మరిన్ని వార్తలు