‘వడ్డీలేని రుణం’ కొనసాగింపు

4 Jan, 2015 01:39 IST|Sakshi
‘వడ్డీలేని రుణం’ కొనసాగింపు
  • పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్
  • సాక్షి, హైదరాబాద్: ‘స్వయం సహాయక గ్రూపుల మహిళలకు‘వడ్డీలేని రుణాలు’ పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పంచాయతీరాజ్ మం త్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. స్వయం సహాయక గ్రూపులకు వడ్డీలేని రుణాలపై శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలు స్వయం సమృద్ధిని సాధించే దిశగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నదని చెప్పారు. తెలంగాణలో స్వయం సహాయక గ్రూపుల మహిళలు తీసుకున్న రుణాలకు గతేడాది అప్పటి ప్రభుత్వం రూ.344.66 కోట్లు  వడ్డీ చెల్లించిందని, ఈ ఆర్థిక సంవత్సరం (2014-15)లో వడ్డీలేని రుణాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.485.44 కోట్లు మంజూరు చేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

    తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు మూడు లక్షల సంఘాలకు చెందిన 30 లక్ష ల మంది మహిళలకు ఆర్థిక భారం తగ్గనుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4.15 లక్షల స్వయం సహాయక గ్రూపులు ఉండగా, రూ.5,921 కోట్లు రుణం తీసుకున్నాయని మంత్రి చెప్పారు. అయి తే.. అందులో మూడు లక్షల సంఘాలు సకాలంలో రుణ వాయిదాలను చెల్లిస్తున్నాయని, వారి రుణాలకు మాత్రమే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందన్నారు.

    మహిళలందరూ సకాలంలో తమ రుణ  వాయిదాలను చెల్లించి వడ్డీ భారం నుంచి మినహాయింపు పొందాలని పిలుపునిచ్చారు. గడువులోగా రుణం చెల్లించిన మహిళల ఖాతాలకు నేరుగా వడ్డీ సొమ్మును ప్రభుత్వం జమ చేయనుందని చెప్పారు. మహిళా సంఘాల రుణాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నందున, ఆయా గ్రూపులకు బ్యాంకు లింకేజీ మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని‘సెర్ప్’ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
     

మరిన్ని వార్తలు